జిల్లాకు పదవీయోగం లేదా..!? | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు పదవీయోగం లేదా..!?

Mar 10 2026 7:13 AM | Updated on Mar 10 2026 7:13 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా.. ఒక్క నామినేటెడ్‌ పదవి ఇవ్వని వైనం.. సీనియర్లు ఉన్నా.. ప్రాధాన్యత సున్నా

నిర్మల్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌.. జిల్లాల పునర్విభజన చేపట్టింది. నిర్మల్‌ జిల్లాగా ఏర్పడింది. అయితే కొత్త జిల్లాపై గత పాలకులు వివక్ష చూపారు. పరిశ్రమలు మంజూరు చేయలేదు. కనీసం జిల్లా నేతలకు కార్పొరేషన్‌ పదవులు ఇవ్వలేదు. ఇక ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. ఈసారి కూడా నామినేటెడ్‌ పోస్టులు దక్కడం లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీది కూడా అదేతీరు. పార్టీ ఏదైనా.. జిల్లా నేతలకు మాత్రం పదవులు దక్కడం లేదు. చుట్టూ ఉన్న జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గంలోనే ఇద్దరు ముగ్గురు నేతలకు రాష్ట్రస్థాయి పోస్టులు, కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు కట్టబెడుతున్నారు. జిల్లాలో సీనియర్లు ఉన్నా.. పార్టీ కోసం శ్రమిస్తున్న నేతలు పదవులను ఆశిస్తున్నా.. అధిష్టానాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై చర్చ నడుస్తుంది. దీంతో మరోసారి జిల్లానేతలు అధిష్టానం వైపు చూస్తున్నారు. ఈసారైన జిల్లా నేతలకు పదవులు ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారు.

చుట్టూ పదవులే..

జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ కోసం ఎంతోమంది సీనియ ర్లు పనిచేస్తున్నారు. ఖానాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెడ్మబొజ్జు పటేల్‌కు డీసీసీతోనే సరి పెట్టారు. డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్‌నేత శ్రీహరిరావును నియోజకవర్గ ఇన్‌చార్జికే పరిమి తం చేశారు. మాజీమంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, సముద్రాల వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్‌, విఠల్‌రెడ్డి, నారాయణరావు పటే ల్‌, గ్రంథాలయసంస్థ చైర్మన్‌ అర్జుమంద్‌అలీ తదిత ర సీనియర్‌ నేతలెవరికీ రాష్ట్రస్థాయి పదవులు ఇవ్వ డం లేదు. వరుస ఎన్నికల్లో వీరంతా కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం శ్రమించారు. పంచాయతీలతో పాటు, మున్సిపాలిటీల్లోనూ ఎక్కువ స్థానాలు కాంగ్రెస్సే దక్కించుకునేలా చేశారు. సీనియర్‌లంతా సమష్టిగా కృషిచేసి నిర్మల్‌ మున్సిపల్‌నూ కై వసం చేసుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న ఇలాంటి సీనియర్లకు ఇప్పటికై నా గుర్తింపునివ్వాలని, జిల్లాకు నామినేటెడ్‌ పోస్టులు, కార్పొరేషన్‌ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్‌ శ్రేణులే డిమాండ్‌ చేస్తున్నాయి. మరి ఈసారైనా జిల్లాకు పదవీయోగం ఉంటుందా.. లేదా.. అనేది వేచిచూడాల్సిందే.

ఒక్కటీ ఇవ్వలె..

రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్‌ సర్కార్‌ అన్నిజిల్లాలకూ ప్రాధాన్యం ఇనిస్తున్నా జిల్లాపై మాత్రం చిన్నచూపు చూస్తోంది. నిధుల మాట అటుంచి, కనీసం జిల్లాకు పదవులను ఇచ్చయినా సంతోషపెట్టడం లేదు. కార్పొరేషన్‌ చైర్మన్లు, ఇతర పోస్టుల కేటాయింపులో జిల్లాను పట్టించుకోవడం లేదన్న వాదన పెరుగుతోంది. నాలుగైదు నెలల క్రితం ఇచ్చిన పదవుల్లోనూ జిల్లాకు మొండిచేయే చూపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావుకు సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చినా ఆయన తీసుకోకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement