హస్తం.. కమలం పోటాపోటీ
నిర్మల్: ముధోల్ పట్టె బీజేపీకి జైకొట్టింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను తలపిస్తూ పంచాయతీపోరులోనూ ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఆధిపత్యం కనబర్చారు. ఐదు మండలాల్లోనూ మెజారిటీ స్థానాలు గెలుచుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్రలోనే ఇప్పటి వరకు సాధించని స్థానాలకు బీజేపీ గెలుపొందింది. అధికార కాంగ్రెస్ పార్టీ స్వతంత్రుల కంటే తక్కువ స్థానాలతో వెనుకబడింది. సరిహద్దు మండలాల్లో అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఎమ్మెల్యేలుగా చేసిన సీనియర్ నేతలున్నా.. హస్తం గతవైభవాన్ని దక్కించుకోలేకపోయింది. పదేళ్లపాటు పల్లెల్లో రాజ్యమేలిన బీఆర్‌ఎస్ అంచనాకు ఐదు అన్నట్లు గెలిచింది. మూడు విడతల్లో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా పంచాయతీలను కై వసం చేసుకున్నారు.
కమలానికే మొగ్గు..
రాష్ట్ర సరిహద్దు మండలాలు బీజేపీ బలపర్చిన అభ్యర్థుల వైపే మొగ్గుచూపాయి. భైంసా, బాసర, ముధోల్, తానూరు, కుభీర్ ఐదు మండలాల్లో అత్యధిక స్థానాలు కమలంపార్టీకే కట్టబెట్టాయి. తానూరు మినహా మిగిలిన నాలుగు మండలాల్లో అధికార కాంగ్రెస్‌పార్టీకి డబుల్ డిజిట్ దక్కక లేదు. బీజేపీ భైంసా మండలంలో 18 చోట్ల గెలుపొందింది. ముధోల్‌లో 13 జీపీలను కై వసం చేసుకుంది. తానూరులో 14 చోట్ల, కుభీర్‌లో 13 జీపీల్లో, బాసరలో 3 స్థానాలు కై వసం చేసుకుంది. మొదటి విడతలో సత్తచాటిన కాంగ్రెస్ రెండోవిడతలో పర్వాలేదనిపించింది. మూడోవిడతలో 133పంచాయతీలకు కేవలం 28 స్థానాలకు పరిమితమైంది. 39 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు.
ప్రభావం చూపని కారు
తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు ఏ పల్లెలో చూసినా కారు జోరే. ముధోల్ నియోజకవర్గంలో మరోపార్టీకి అవకాశం లేకుండా బీఆర్‌ఎస్ హవా కొనసాగించింది. అలాంటి స్థితి నుంచి నామమాత్రంగానైనా పోటీఇవ్వని స్థాయికి దిగజారింది. ఐదు మండలాల్లో అంచనాకు అన్నట్లుగా ఐదు జీపీలకు పరిమితమైంది.
పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యేలు..
జిల్లాలో మూడు విడతల సర్పంచ్ ఎన్నికలను పరిశీలిస్తే.. ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తొలివిడత ఎన్నికలు నిర్వహించిన ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు ఉన్నారు. ఆ నాలుగు మండలాల్లో కలిపి ఆపార్టీ 69 స్థానాలను దక్కించుకుని పైచేయి సాధించింది. బీజేపీ 22 స్థానాలకు పరిమితమైంది. రెండోవిడతలో నిర్మల్‌లోని ఐదుమండలాలు, ముధోల్‌లోని రెండు మండలాలు బీజేపీ ఎమ్మెల్యేలైన మహేశ్వర్‌రెడ్డి, రామారావుపటేల్ పరిధిలోనివి. మలివిడతలో ఏకంగా 51 స్థానాల్లో ఆధిక్యతను చాటింది. కాంగ్రెస్‌కు 49 జీపీలు దక్కాయి. మూడోవిడతలో ముధోల్ నియోజకవర్గంలో ఐదుమండలాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 61 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ను 28 స్థానాలకు పరిమితమైంది.
విడతల వారీగా పార్టీలు గెలిచిన జీపీలు..
విడతలు బీజేపీ కాంగ్రెస్ బీఆర్‌ఎస్ స్వతంత్రులు
మొదటి విడత 22 69 19 26
రెండోవిడత 51 49 01 30
మూడో విడత 61 28 05 39
మొత్తం 134 146 25 95


