సమర్థవంతంగా అమ్మ రక్షిత
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో నవజాత శిశు మరణాల నిర్మూలనకు అమలు చేస్తున్న అమ్మరక్షిత కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా కొనసాగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అమ్మరక్షిత కార్యక్రమం అమలుపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. అమ్మరక్షిత కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయిందన్నారు. దీంతో నవజాత శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. ఇందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా వైద్యులను అభినందించారని తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత ఉత్సాహంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఇందుకు తనవంత సహకారం అందిస్తానని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు మొదలుకొని, జిల్లాస్థాయి ప్రసూతి ఆస్పత్రిలో వైద్యుల వరకు పర్యవేక్షణ, చొరవ ఉండాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్య సలహాలు, పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన టెలిఫోన్ కాల్ సహాయ సదుపాయం నిరంతరం కొనసాగాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్, వైద్యశాఖ అధికారులు గోపాల్‌సింగ్, సౌమ్య, సరోజ, అధికారులు పాల్గొన్నారు.


