రేపే తుది సం‘గ్రామం’ | - | Sakshi
Sakshi News home page

రేపే తుది సం‘గ్రామం’

Dec 16 2025 11:48 AM | Updated on Dec 16 2025 11:48 AM

రేపే తుది సం‘గ్రామం’

రేపే తుది సం‘గ్రామం’

ఐదు మండలాల్లో పోలింగ్‌ 133 జీపీలు, 1,126 వార్డులు.. 9 పంచాయతీలు, 333 వార్డులు ఏకగ్రీవం 124 సర్పంచ్‌, 793 వార్డు పదవులకు ఎన్నికలు

నిర్మల్‌: జిల్లాలో పంచాయతీ పోరులో చివరి దశకు చేరుకుంది. మూడో విడతలోని బాసర, ముధోల్‌, తానూరు, భైంసా, కుభీర్‌ మండలాల్లో బుధవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు పోలింగ్‌ కేంద్రాలతోపాటు సామగ్రి పంపిణీ సెంటర్లలో ఏర్పాట్లు చేశారు. చివరి విడతలోని ఐదు మండలాల్లో మొత్తం 133 గ్రామపంచాయతీలు, 1,126 వార్డులు ఉండగా, ఇందులో 9 జీపీలు, 333 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 124 సర్పంచ్‌ స్థానాలు, 793 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

కుభీర్‌లో 42.. బాసరలో 10..

మొదటి, రెండు విడతలతో పోలిస్తే మూడో విడతలో మండలాలు తక్కువగా ఉన్నా.. ఇక్కడ జీపీలు, ఓటర్ల సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంది. జిల్లాలోనే అత్యధికంగా కుభీర్‌ మండలంలో 42 గ్రామపంచాయతీలు, 344 వార్డులు ఉన్నాయి. అత్యల్పంగా బాసరలో కేవలం 10 జీపీలు, 90 వార్డులు ఉన్నాయి. మొత్తం 1,50,593 ఓటర్ల ఉండగా, ఇందులో 73,085 మంది పురుషులు, 77,502 మంది మహిళలు, ఆరుగురు ఇతరులు ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.

నేడు పోలింగ్‌ కేంద్రాలకు..

జిల్లా సరిహద్దు మండలాల్లో చివరి పోరాటానికి సర్వం సిద్ధమైంది. ఐదు మండలాల్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండల కేంద్రాల్లో పంపి ణీ కేంద్రాలను, గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశారు. భైంసా, ముధోల్‌, కుభీర్‌ మండలపరిషత్‌ కార్యాలయాల్లో, తానూరు, బాసర మండల కేంద్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో సామగ్రి పంపిణీ చేస్తారు. పోలింగ్‌ సిబ్బంది మంగళవారం ఉదయమే కేంద్రాల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. సాయంత్రానికి తమకు కేటాయించిన పంచాయతీలకు వెళ్లాలి. అక్కడే రాత్రి బసచేసి, బుధవారం ఉదయం పోలింగ్‌, కౌంటింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది.

ప్రజాతీర్పు ఎలా ఉంటుందో..

మొదటి, రెండో విడతల పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేలిపోయాయి. ఇక చివరి విడతలో పల్లెతీర్పు ఎలా ఉంటుందో, ప్రజలు ఏవైపు నిలుస్తారోనన్న ఆసక్తి జిల్లావాసుల్లో నెలకొంది. రెండు విడతలను చూసుకుంటే మొదటి విడతలో కాంగ్రెస్‌, రెండో విడతలో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు అధిక్యం కనబర్చరు. ఇక ఈ విడతలో ఎటువైపు మొగ్గుచూపుతారోనన్న చర్చ నడుస్తోంది. ఈ ఐదు మండలాలు ముధోల్‌ నియోజకవర్గానికి చెందినవే కావడంతో స్థానిక నేతలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మూడోవిడత జీపీలు, ఓటర్ల వివరాలు..

మండలం జీపీలు వార్డులు మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు

భైంసా 30 258 33,970 16,320 17,648 02

ముధోల్‌ 19 166 28,754 13,844 14,908 02

తానూరు 32 268 31,516 15,513 16,003 ––

బాసర 10 90 15,728 7,572 8,155 01

కుభీర్‌ 42 344 40,625 19,836 20,788 01

మొత్తం 133 1,126 1,50,593 73,085 77,502 06

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement