అంతుచిక్కని ఓటరు నాడి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో రెండు విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడో విడత ఎన్నికలు ఈనెల 17న జరుగనున్నాయి. ముధోల్ నియోజకవర్గంలోని భైంసా, ముధోల్, తానూర్, బాసర, కుభీర్ మండలాల్లోని 133 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, పది పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో తుది విడత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటరు నాడి అంతుచిక్కక ఆందోళన చెందుతున్నారు. మొదటి, రెండో విడత ఫలితాల సరళి చూసి మరింత టెన్షన్ పడుతున్నారు. ఓటర్ల ను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ముగిసిన ప్రచారం..
మూడో విడత పోలింగ్ జరిగే పంచాయతీల్లో ప్రచా రం సోమవారం సాయంత్రం ముగిసింది. పోలింగ్ కు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో మద్యం, మటన్, చికెన్, పిండి వంటలతోపాటుఉ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. గెలుపు కోసం ఖర్చు కు వెనుకాడడం లేదు. ప్రలోభాల జోరు పెంచుతున్నారు. పట్నం, వలస ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఊహించిన దానికంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నా రు. గ్రామాల్లో ‘ఓటుకు నోటు’ టీంలు రంగంలోకి దిగాయి. ఒక్కో ఓటరుకు రూ.500 నుంచి రూ.3 వేల వరకు ఇస్తున్నట్లు సమాచారం. ‘సైలెంట్ క్యాంపెయిన్’ పేరుతో ఓట్ల యుద్ధం సాగిస్తున్నారు.
మద్యం పంపిణీ..
ఇక మద్యం పంపిణీకి ప్రత్యేక ప్రదేశాలను సిద్ధం చేసి ప్రచారం ప్రారంభించిన రోజు నుంచే పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజు ఉదయం వరకు కొరత రాకుండా స్టాక్ సిద్ధం చేశారు. అనేక గ్రామాల్లో మందు బాటిళ్లు, పిండి, నూనె క్యాన్లు, కూల్ డ్రింక్స్ పంపిణీ మొదలు పెట్టారు. మటన్–చికెన్ షాపుల్లో కిలో చొప్పున ప్యాక్ చేయాలంటూ ఆర్డర్లు వేసి అడ్వాన్సు కూడా చెల్లించారనే ప్రచారం ఉంది. వలస ఓటర్లకు బస్సు చార్జీలు, పెట్రోల్ ఖర్చులు ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తున్నారు.


