పల్లెల్లో ‘మహా’ మద్యం
తానూరు: జిల్లా సరిహద్దు గ్రామాల్లో మహారాష్ట్రకు చెందిన దేశీదారు ఏరులై పారుతోంది. అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా ఎకై ్సజ్ అధికారులు అరికట్టలేకపోతున్నారు. మన మద్యం ధరలతో పోలిస్తే అక్కడి మద్యం ధర తక్కువగా ఉండడంతో సరిహద్దు పల్లెల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నవారు దేశీదారు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నారు. అక్రమ రవాణా ప్రభుత్వ ఆదాయానికి గండి పడడంతో, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారాయి.
యథేచ్ఛగా విక్రయాలు
తానూరు, కుభీర్, ముధోల్, బాసర, కుంటాల, సారంగాపూర్, భైంసా మండలాల్లో దేశీదారుల విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. తానూరు మండలం బామ్ని, మొగ్లి, మహాలింగి, మసల్గా, కళ్యాణి, జౌలా(బి), తొండాల, ఖర్భాలా, ఎల్వత్, దాగాం, దౌలతాబాద్, బోల్సా, కోలూరు గ్రామాల్లో బహిరంగంగానే దేశీదారు విక్రయాలు జరుగుతున్నాయి. బాసరలో బిద్రెల్లి, ఓని, కౌటా, సాలాపూర్, టాక్లి, సారంగాపూర్ మండలం సిర్‌పల్లి, స్వర్ణ, కుభీర్ మండలం నిగ్వ, పార్డీ(బి), హల్దా, పల్సి, భైంసా మండలంలో అనేక గ్రామాల్లో దేశీదారు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎకై ్సజ్ అధికారులు కూడా అంతా ‘మామూలు’ అన్నట్లుగా చూస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో రూ.లక్షల వ్యాపారం
సరిహద్దు గ్రామాల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థులు ఓటర్లకు పంచేందుకు మహారాష్ట్ర దేశీదారును ఎంచుకుంటున్నారు. దీంతో పక్షం రోజులుగా నిత్యం లక్షల రూపాయల వ్యా పారం జరుగుతోంది. పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండటంతో రాత్రి తనిఖీలు తగ్గాయి. ఇదే అదనుగా దేశీదారు అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.
రాత్రి వేళ డెలివరీలు..
తానూరు, కుభీర్, భైంసా, బాసర, ముధోల్, సారంగాపూర్ మండలాలకు 2–3 కి.మీ. దూరంలో మహారాష్ట్ర వైన్ షాపులు ఉన్నాయి. స్థానిక వ్యాపారులు అక్కడి మద్యం వ్యాపారులతో మాట్లాడుకుని దేశీదారు రవాణా చేస్తున్నారు. ఉదయం ఆర్డర్లు ఇస్తే.. రాత్రి డెలివరీ చేస్తున్నారు. నాందేడ్–భైంసా రహదారిపై చెక్‌పోస్ట్ ఉన్నా, గ్రామాల గుండా తరలిస్తున్నారు. ధర్మాబాద్, రాఠి, దివసీ, పాల్జ్, టోటంబ, హిమాయత్‌నగర్ నుంచి ఆటోలు, బైకులు, కాలినడల ద్వారా రవాణా సాగుతోంది. ఇస్లాపూర్ నుంచి జిల్లా కేంద్రం వరకు కూడా చేరుతోంది.
తనిఖీలు నిర్వహిస్తాం
మహారాష్ట్ర సరిహద్దులోని బెల్‌తరోడా జాతీయ రహదారిపై చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తున్నాం. చెక్‌పోస్ట్ వరకు తమ విధులు ఉంటాయి. మహారాష్ట్ర నుంచి మద్యం రాకుండా సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశాం. వాహనాలు తనిఖీ చేస్తున్నాం.
– లక్ష్మణ్, బెల్‌తరోడా ఎకై ్సజ్ సీఐ


