పల్లెల్లో ‘కమల’ వికాసం
నిర్మల్: రెండో విడత పంచాయతీ పోరులో బీజేపీ, కాంగ్రెస్ మద్దతుదారులు హోరాహోరీగా తలపడ్డాయి. స్వల్పస్థానాలతో కమలం పార్టీ అధిక్యత సాధించింది. ఇప్పటి వరకు పట్టులేని పల్లెప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లింది. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకు పరిమితమైన కాషాయ పార్టీ గ్రామీణ ఓటర్లనూ ఆకట్టుకుంది. గతంలో కనీసం ఊహించని స్థానాల్లో తాము బలపర్చిన అభ్యర్థులు గెలవడంతో పార్టీశ్రేణులు సంతోషంగా ఉన్నాయి. అధికార కాంగ్రెస్ తొలివిడత జోరును ఇక్కడా చూపింది. బీజేపీ గట్టిపోటీ ఇచ్చినా మేజర్ జీపీలతోపాటు దాదాపు సగం గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనూ తమపార్టీ బలపర్చిన అభ్యర్థులు సత్తాచాటడంపై హస్తం శ్రేణులు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. ఇక గత పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేని పార్టీగా గెలుపొందిన బీఆర్‌ఎస్ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. చివరకు ఆ పార్టీ మద్దతులో సర్పంచ్‌గా గెలిచిన వాళ్లూ.. ఇండిపెండెంట్ అభ్యర్థులమని చెప్పుకోవడం ఆపార్టీ దీనస్థితికి అద్దంపడుతోంది. రాజకీయపార్టీల మద్దతుదారులతోపాటు ఈ విడతలో స్వతంత్రుల సంఖ్య ఎక్కువగానే ఉంది. రెండో విడతలో గెలిచిన సర్పంచుల్లో అధికశాతం రాజకీయాలకు, పదవులకు కొత్తవారే.
స్వతంత్రులకూ జైకొట్టారు..
ఏపార్టీతో సంబంధం లేనివాళ్లను, ప్రధాన పార్టీలకు రెబల్స్‌గా ఉన్నవాళ్లనూ రెండోవిడత ఓటర్లు గెలిపించారు. ఈ విడతలో ఏకంగా 30 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. తొలివిడతలోనూ 26 మంది ఇండిపెండెంట్లు విజయం సాధించారు. చాలాగ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు రెబల్స్‌గా పోటీలో ఉన్నవారు గెలు పొందారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వగ్రామమైన నిర్మల్‌రూరల్ మండలం ఎల్లపె ల్లిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలుపొందడం గమనార్హం.
పార్టీల వారీగా గెలిచిన మద్దతుదారులు, ఇతరుల వివరాలు..
మండలం జీపీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్‌ఎస్ ఇతరులు
నిర్మల్‌రూరల్ 20 05 08 –– 07
సోన్ 14 06 07 –– 01
సారంగపూర్ 32 18 14 –– 00
దిలావర్‌పూర్ 12 04 05 –– 03
నర్సాపూర్(జి) 13 06 03 –– 04
లోకేశ్వరం 25 07 08 –– 10
కుంటాల 15 03 06 01 05
మొత్తం 131 49 51 01 30
కమల వికాసం..
ఐదేళ్లక్రితం ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ ఆ తర్వాత నుంచి క్రమంగా జిల్లాలో బలపడుతూ వస్తోంది. నిర్మల్, ముధోల్ ఎమ్మెల్యే స్థానాలను, రెండోసారి ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. అదే ప్రభావంతో తాజాగా తొలి, రెండోవిడత పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తాచాటింది. తొలివిడతలో 22 స్థానాలకు పరిమితమైన పార్టీ రెండోవిడతలో ఏకంగా ఆఫ్ సెంచరీ(51) దాటింది. ప్రధానంగా నిర్మల్‌రూరల్, సోన్, దిలావర్‌పూర్, లోకేశ్వరం, కుంటాల మండలాల్లో హస్తం పార్టీపై అధిక్యత సాధించింది. సారంగపూర్, నర్సాపూర్(జి) మండలాల్లో మాత్రం వెనుకంజలో ఉంది. బీజేపీ నుంచి గెలిచినవాళ్లలో చాలామంది కొత్తముఖాలే.
కనిపించని కారు..
జిల్లాలో పదేళ్లు ఓ వెలుగు వెలిగిన కారుపార్టీ ఈసారి పంచాయతీ ఎన్నికల్లో కనీసం కనిపించకుండా పోయింది. రెండోవిడతలో బీఆర్‌ఎస్ కేవలంలో ఒకేస్థానానికి పరిమితమైంది. తొలివిడతలో కనీసం 19 స్థానాలతో గౌరవప్రదంగా నిలిచిన పార్టీ రెండోవిడతలో చేతులెత్తేసింది. ఈ ఏడు మండలాల్లో బీఆర్‌ఎస్‌కు బలమైన నేతలు, క్యాడర్ లేకపోవడమే ఈ ఓటమికి కారణంగా చెప్పవచ్చు.
పల్లెల్లో ‘కమల’ వికాసం
పల్లెల్లో ‘కమల’ వికాసం


