అద్వితీయం
ఓటేసిన దివ్యాంగ మహిళ
నిర్మల్: ఐదేళ్లపాటు తమ గ్రామ భవిష్యత్తును ఎన్నుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే బయలుదేరారు. చలిని కూడా లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాల్లో బారులుదీరారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలోని ‘మధ్య’మండలాలు ఓటెత్తాయి. నిర్మల్‌రూరల్, సోన్, సారంగపూర్, దిలావర్‌పూర్, నర్సాపూర్(జి), కుంటాల, లోకేశ్వరం మండలాల్లో ఆదివారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఏడు మండలాల్లో కలిపి 82.67 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా పురుషులకన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఓటేయడంలోనూ పైచేయి సాధించారు. వృద్ధులు, దివ్యాంగులు సైతం ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించారు. ఆ సమయం వరకు గేటులోపల ఉన్నవారిని అనుమతించారు. తర్వాత వచ్చిన ఓటర్లను లోపలికి రానివ్వలేదు. మధ్యాహ్న 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించారు. తక్కువ వార్డులు, ఓట్లు ఉన్న గ్రామపంచాయతీల ఫలితాలు సాయంత్రం 5 గంటలలోపే వచ్చేశాయి. మేజర్ జీపీలు, ఓట్లు ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో లెక్కింపు రాత్రివరకూ జరిగింది.
పెరిగిన పోలింగ్..
జిల్లాలో రెండో విడతలో మొత్తం 131 జీపీలు, 1,170 వార్డులు ఉండగా, పది పంచాయతీలు, 430 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 121 సర్పంచ్ స్థానాలు, 740 వార్డుసభ్యులకు ఎన్నికలు నిర్వహించారు. తొలివిడత ఎన్నికల్లో 80.42 శాతం నమోదు కాగా, రెండో విడతలో 82.67 శాతం పోలింగ్ నమోదైంది.
ఎల్లపెల్లిలో ఓటు వేసిన మాజీ మంత్రి ఐకేరెడ్డి


