మక్కల పైసలు రాలే..!
లక్ష్మణచాంద: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించినా సకాలంలో డబ్బులు అందక జిల్లాలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వానా కాలంలో సాగుచేసిన మొక్కజొన్నను ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న సేకరించింది. జిల్లాలో వానాకాలంలో దాదాపు 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. కొంతమంది రైతులు ప్రైవేటుగా అమ్ముకోగా, చాలామంది మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో విక్రయించారు.
6,790 మెట్రిక్‌టన్నులు సేకరణ..
మార్క్‌ఫెడ్ అధికారుల సమాచార ప్రకారం, జిల్లాలో మొత్తం 2,700 మంది రైతుల నుంచి సుమారు 6,790 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరించారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరగా క్వింటాలుకు రూ.2,400ని నిర్ణయించింది. పంట అమ్మి 50 రోజులు అయినా ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. యాసంగి పనులు ప్రారంభమవుతున్నా డబ్బులు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కోరుతున్నారు.
జిల్లా సమాచారం....
మొక్కజొన్న సాగు విస్తీర్ణం 30 వేల ఎకరాలు
ప్రభుత్వానికి మొక్కజొన్న
అమ్మిన రైతులు 2,700
మార్క్ ఫెడ్ సేకరించిన మక్కలు
6,790 మెట్రిక్ టన్నులు
రైతులకు రావాల్సిన డబ్బులు రూ.16 కోట్లు


