తేమ నిబంధన సడలించాలి
భైంసాటౌన్: సీసీఐ పత్తి కొనుగోళ్లలో 8 శాతం తేమ నిబంధన సడలించాలని, 22 శాతం తేమ ఉన్న పత్తిని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని గాంధీగంజ్‌లో రైతులతో మంగళవారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భైంసాకు చేరుకున్న కేటీఆర్‌కు స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్ గాంధీగంజ్‌లో రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పత్తి, సోయా సాగు చేసిన రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోయా ఎకరానికి 13 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని, సీసీఐలో పత్తిని 22 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తేమశాతం నిబంధన ఎత్తివేయించాలన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని, కాంగ్రెస్ పాలనలో అన్ని అవస్థలే అన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జాన్సన్‌నాయక్, బాల్క సుమన్, ముధోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు రమాదేవి, విలాస్‌గాదేవార్, కిరణ్ కొమ్రేవార్ పాల్గొన్నారు.


