సోయా వాపస్‌పై రైతుల ఆగ్రహం
కుంటాల: మండలంలోని సోయా రైతులు మంగళవారం కల్లూరులో 61వ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. మండలంలోని పెంచికల్‌పాడ్, కుంటాల గ్రామాల్లో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ఈనెల 12న తూకం వేసిన ధాన్యాన్ని అధికారులు నిజామాబాద్ జిల్లా బోధన్ సీడబ్ల్యూసీ గోదాంకు తరలించారు. అక్కడి అధికారులు సోయా నాసిరకంగా ఉందని తిరిగి కుంటాలకు వాపస్ పంపించారు. దీంతో రైతులు మంగళవారం ఆందోళన చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్షాల కారణంగా పంట నాణ్యత దెబ్బతిన్నదని తెలిపారు. ప్రతీగింజ కొనుగోలు చేస్తామని ఇబ్బంది పెట్టొద్దని కోరారు.
అధికారులను నిలదీత..
విషయాన్ని తెలుసుకున్న మార్క్‌ఫెడ్ డీఎం మహేశ్‌కుమార్, తహసీల్దార్ కమల్‌సింగ్ అక్కడికి రాగా, వారిని రైతులు నిలదీశారు. తిరిగి వచ్చిన సోయా ను మళ్లీ పంపించి తమ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. సోయా తిరిగి వచ్చిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ప్రతీ కొనుగోలు కేంద్రాల్లో సర్వేయర్లను ప్రభుత్వం నియమించిందని, వారు నాణ్యత పరిశీలించాకే కొనుగోలు చేస్తామని డీఎం మహేశ్‌కుమార్ రైతులకు నచ్చజెప్పడంతో శాంతించారు.
189 సోయా బస్తాలు వెనక్కి
లోకేశ్వరం: మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో శనివారం కొనుగోలు చేసిన సోయా బస్తాలను భోదన్‌లోని సీడబ్ల్యూసీ గోదాంకు తరలించారు. అక్కడ 189 సోయా బస్తాల్లో నాణ్యత లేదని తిరస్కరించడంతో మంగళవారం రాత్రి తిరిగి వచ్చాయి. దీంతో వాటిని కొనుగోలు కేంద్రం వద్ద ఉంచారు.


