తొలిమెట్టు పకడ్బందీగా అమలు చేయాలి
నిర్మల్ రూరల్: పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సూచించారు. మండలంలోని అక్కాపూర్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలలో స్పెషల్ కాంపెయిన్ కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. తరగతి గదులు పరిశీలించి, ఉపయోగ పడేవి, ఉపయోగంలో లేని, పనికిరాని వస్తువుల జాబితా రూపొందించాలని సూచించారు. కమిటీతో చర్చించి, అవసరం లేని వస్తువులను తొలగించాలన్నారు. అనంతరం విద్యార్థుల్లో తొలిమెట్టు సామర్థ్యాలు పరిశీలించారు. 3వ తరగతి విద్యార్థులకు ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ పరీక్ష నిర్వహిస్తామని, అందులో విద్యార్థులు ప్రగతి సాధించేలా చూడాలన్నారు.
ప్రధానోపాధ్యాయులతో సమీక్ష..
ప్రభుత్వ పాఠశాలలో స్పెషల్ క్యాంపెయన్ 5.0 పకడ్బందీగా నిర్వహించాలని సత్యనారాయణరెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో స్పెషల్ క్యాంపెయిన్ 5.0 అమలుపై డీఈవో భోజన్నతో కలిసి సమీక్ష నిర్వహించారు. తెలుగు ఉపాధ్యాయుడు పోతన్న ఆధ్వర్యంలో సోన్ మండలం వెల్మల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రచించిన కథల సంపుటి అంకురాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ పరమేశ్వర్, జిల్లా విద్యా శాఖ సమన్వయకర్తలు ప్రవీణ్‌కుమార్, నర్సయ్య, మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


