వికాసం..లేనట్లేనా?
రాజీవ్ యువవికాసం అమలుపై నీలినీడలు నిరుద్యోగుల నుంచి 35,177 దరఖాస్తుల స్వీకరణ రాష్ట్ర అవతరణ రోజునే కేటాయించాల్సిన యూనిట్లు 5 నెలలు కావస్తున్నా అందని మంజూరు పత్రాలు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు రాయితీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు రాజీవ్ యువ వికాసం పేరిట దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వపరంగా ఉద్యోగాలు అంతంతమాత్రంగానే ఉండడంతో ఈ పథకంతో స్వయం ఉపాధికి బాటలు వేసుకోవచ్చన్న ఉద్దేశంతో యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు జూన్ 2న మంజూరు పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగ యువతలో హర్షతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఐదు నెలలు కావస్తున్నా మంజూరు పత్రాలు అందించలేదు. అవి ఎప్పుడూ అందుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
దరఖాస్తులు ఎక్కువ... మంజూరు తక్కువ
కమిటీలు ఏర్పాటు చేసినా..
శాఖల వారీగా అందిన దరఖాస్తులను మండల, మున్సిపల్ స్థాయి కమిటీలు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. కమిటీల్లో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు మండల, పట్టణ ప్రత్యేకాధికారులు, ఐకేపీ ఏపీఎం, సంక్షేమ శాఖల తరపున సిబ్బంది, బ్యాంకు అధికారులకు స్థానం కల్పించారు. అయినా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముందుకు సాగక పోవడంతో కమిటీలు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి.
ఆర్బీఐ నిబంధనలు..
గతంలో పేదలకు ఆయా పథకాల కింద రుణాలు అందించేవారు. అవసరమైతే సబ్సిడీకి మించి రుణాలు తీసుకుంటే ష్యూరిటీ కింద సంతకాలు తీసుకునేవారే తప్ప పెద్దగా బ్యాంకర్లు ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. ప్రస్తుతం మారిన ఆర్బీఐ నిబంధనల ప్రకారం సిబిల్ స్కోర్ ఉంటేనే రుణానికి అర్హత సాధిస్తారు.
ప్రభుత్వ నిర్ణయంపైనే ఆశలు..
స్వయం ఉపాధి ద్వారా నిరుద్యోగులు ఆర్థిక స్వావలంబన పొందేందుకు రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రవేశపెట్టి రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే నెలలు గడుస్తున్న పథకం అమలుపై స్పష్టత కరువైంది. ప్రభుత్వం ఇచ్చే రుణాలతో కుటుంబానికి బాసటగా నిలవడంతో పాటు ఆర్థికంగా ఎదగాలనే గ్రామీణ ప్రాంత యువతకు నిరాశే మిగిలింది. స్థానిక ఎన్నికలు సమీపించడంతో యువవికాసం పథకం అమలుపై సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా సిబిల్ స్కోరును మినహాయిస్తేనే గ్రామీణ ప్రాంతంలోని ఎక్కువ మంది నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.
జిల్లాలో రాజీవ్ యువవికాసం దరఖాస్తుల వివరాలు
కార్పొరేషన్ దరఖాస్తులు మంజూరైన రాయితీ నిధులు యూనిట్లు (రూ.కోట్లలో)
ఎస్సీ 7,350 2,894 39.96
ఎస్టీ 3,627 2,325 25.35
బీసీ 17,286 3,876 41.00
ఎంబీసీ/ఈబీసీ 923 842 8.90
మైనార్టీ 5,926 1,045 17.41
క్రిస్టియన్ 65 27 0.42


