తానూరులో విఠలేశ్వర జాతర
తానూరు: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం తానూరులో జాతర విఠలేశ్వర నిర్వహించారు. మరో పండరిపురంగా భావించే తానూరులోని విఠలరుక్మాబాయిని దర్శించుకున్నారు. చుట్టుపక్కల గ్రామాలే కాకుండా మహారాష్ట్రలోని భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తానూరులో ఏ ఇంట చూసినా బంధువులు, పుట్టింటి ఆడపడుచులు, తెలిసిన వారితో నిండుగా కనిపించాయి. దూర ప్రాంతాల్లో చదివే విద్యార్థులు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారంతా పౌర్ణమి జాతరకు వచ్చి ఉత్సాహంగా గడిపారు.
కొనుగోళ్ల సందడి...
తానూరు ప్రధాన రహదారి, పోలీస్‌స్టేషన్ ప్రాంతం, హైస్కూల్ ఆవరణ చిరు దుకాణాలతో నిండిపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు చక్కెర బిళ్లలు, కుంకుమ, మొలతాడులు, తదితర సామగ్రి దుకాణాల వద్ద కొనుగోళ్ల సందడి కనిపించింది. రంగులరాట్నాల వద్ద యువత కేరింతలు కొట్టారు.
ఆధ్యాత్మిక శోభ...
కార్తిక పౌర్ణమి సందర్భంగా చివరి రోజు నిర్వహించిన కార్యక్రమాలతో తానూరులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మంగళవారం రాత్రి రథయాత్ర చేపట్టారు.
అలరించిన కుస్తీ పోటీలు...
ఈ సందర్భంగా జాతరలో కుస్తీ పోటీలు నిర్వహించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నాందేడ్, పర్భణి, బిలోలి, ముధ్‌ఖేడ్, పునే, భోకర్, కిన్వట్ ప్రాంతాల నుంచి మల్లయోధులు పోటీల్లో తలపడ్డారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.11,111 పాటు వెండి కడియం, ద్వితీయ బహుమతి రూ.8,851 నగదుతో పాటు వెండికడియం అందజేశారు. సీఐ మల్లేశ్, ఎస్సై హన్మాండ్లు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
తానూరులో విఠలేశ్వర జాతర


