‘కృష్ణశిల’లో తల్లి కొలువు..
‘అడెల్లి’ నిర్మాణంలో తమిళనాడు నల్లరాయి అమ్మవారి విగ్రహమూ అక్కడి నుంచే.. కృష్ణశిలలతో గర్భగుడి, అర్ధమండపం ప్రాచీన శైలీలో ఆలయానికి రూపు గ్రామస్తులంతా కలిసి.. అమ్మను నిలిపి..
నిర్మల్: ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పవల్లిగా, జిల్లా ఇలవేల్పుగా పూజలందుకుంటున్న అడెల్లి మహాపోచమ్మ పునఃప్రతిష్ఠాపనోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. చుట్టూ ఉన్న పచ్చని సహ్యాద్రి శ్రేణుల చివరి సానువులు వేదమంత్రాలతో మార్మోగుతున్నాయి. అడవి మధ్యలో ఉండే అడెల్లి జనసందోహంగా మారుతోంది. ప్రధానంగా ఆలయ గర్భగుడి, అర్ధమండపాన్ని కృష్ణశిలలతో, ప్రాచీనరూపులో నిర్మించడం, అమ్మవారి విగ్రహాన్ని అడెల్లివాసులే నిలుపుకోవడం గమనార్హం.
తమిళనాడు నుంచి అడెల్లికి..
అడెల్లి పోచమ్మ ఆలయ పునర్ నిర్మాణ ప్రక్రియ 2023లో ప్రారంభమైంది. అప్పటి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచన మేరకు అమ్మవారి గర్భగుడిని కృష్ణశిలలతో నిర్మించాలని నిర్ణయించారు. 2024లో ఏడాదికాలంలో నిర్మాణ పనులు పూర్తిచేశారు. గర్భగుడి, అర్ధమండపాన్ని నిర్మించేందుకు తమిళనాడు నుంచి కృష్ణశిలలను తెప్పించా రు. శిల్పి వెంకటేశన్ ఆధ్వర్యంలో శిల్పాలను, ఆకృతులను చెక్కి ఆలయంగా మలిచారు.
అమ్మ విగ్రహమూ అక్కడి నుంచే..
అడెల్లి మహాపోచమ్మ నూతన విగ్రహాన్నీ తమిళనాడు నుంచే తీసుకువచ్చారు. మహాబలిపురంలో విగ్రహాలను తయారు చేసే కృష్ణశిలతోనే అమ్మవారి కొత్తరూపును తీసుకువచ్చారు. తల్లితోపాటు తన ఏడుగురు అక్కాచెల్లెళ్లు (సప్తమాత్రికలు), పోతరాజు, ద్వారపాలకులు, ధ్వజస్థంభం, పొత్రం ఇలా ఇవన్నీ మహాబలిపురం నుంచే తెప్పించారు.
ఏళ్లపాటు నిలిచేలా..
వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇందుకు కారణం వాటిలో ఎక్కడ సిమెంటు, ఇటుక వంటివి వాడకుండా కేవలం రాళ్లతోనే నిర్మాణాలను చేపట్టడం. అడెల్లి ఆలయాన్ని రూ.6.60 కోట్లతో నిర్మించారు. నిర్మల్‌లోని బంగల్‌పేట్ మహాలక్ష్మీ ఆలయాన్ని తొలిసారి కృష్ణశిలలతో నిర్మించామని, మళ్లీ అడెల్లి పోచమ్మ ఆలయాన్నీ అలాగే నిర్మించే అదృష్టం దక్కిందని ఆలయ నిర్మాణ కాంట్రాక్టర్ లక్కడి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
విశాలమైన మండపం
ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ల నుంచీ అడెల్లి పోచమ్మ వద్దకు భక్తులు భారీగా వస్తుంటారు. ప్రతీ ఆదివారం అమ్మవారి సన్నిధి వేలాదిమంది భక్తులతో నిండిపోతుంది. ఈ నేపథ్యంలోనే నూతన ఆలయాన్ని విశాలంగా నిర్మించారు. ఒకేసారి వందలసంఖ్యలో భక్తులు దర్శించుకునేలా మండప నిర్మాణం చేపట్టారు. గర్భగుడి, అర్ధమండపాన్నీ విశాలంగానే నిర్మించారు.
‘కృష్ణశిల’లో తల్లి కొలువు..
‘కృష్ణశిల’లో తల్లి కొలువు..


