సంతోష్‌నగర్ పాఠశాలకు రాష్ట్రస్థాయి అవార్డు
మామడ: ఎఫ్‌ఆర్‌ఎస్ అమలులో భాగంగా మండలంలోని సంతోష్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు రాష్ట్రస్థాయిలో అవార్డు లభించింది. వందశాతం హాజరు నమోదుతో విద్యాశాఖ అధికారులు పాఠశాలను అవార్డుకు ఎంపిక చేశారు. శనివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్ ఏఎస్‌పీడీ రాధారెడ్డి, వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, నిర్మల్ డీఈవో భోజన్న చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ద్యాగ రాజేంద్ర లీడర్‌షిప్ అవార్డు అందుకున్నారు.
ఉదయం 8గంటలకే పాఠశాలకు...
పాఠశాలలో 61 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు ఉదయం 8 గంటలకే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పాఠశాలకు రప్పించే విధంగా ప్రణాళిక వేసుకుని అమలు చేస్తున్నారు. పాఠశాలలో కృత్యాదార బోధనతో విద్యార్థులు ఆకర్షితులై క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు మెరుగైన హాజరుతో పాఠశాలను అవార్డు వరించింది.


