పీఆర్సీపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి
నిర్మల్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి పీఆర్సీపై త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లయిందని తెలిపారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే సీపీఎస్ రద్దు చేశాయని, హామీకి కట్టుబడి తెలంగాణలోనూ సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కులకు భంగం కలగకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. టెట్ నుంచి మినహాయింపు విద్యా హక్కు చట్టం సవరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌లో ఆర్థిక శాఖ అలసత్వం సరికాదన్నారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించి, ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ పోస్టులకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఉద్యోగులంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని, ప్రభుత్వం అదే రీతిలో ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి రావాల్సిన ప్రయోజనాలు ఇంకా అందక పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేజీబీవీ, ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందులో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.భూమన్నయాదవ్, జె.లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి ఇర్ఫాన్‌షేక్, నాయకులు శ్రీనివాస్, పరమేశ్వర్, అశోక్‌కుమార్, లక్ష్మీనారాయణ, ఖాలిద్‌అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.


