ఆదర్శ విద్యార్థుల ప్రతిభ
కుంటాల: ఇటీవల నిర్మల్‌లో నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్‌లో కుంటాల ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు దివ్య, నాగజ్యోతి, విశాల్, జస్వంత్, అవంతిక, విద్య, స్వప్న, కార్తికేయ, మోక్షశ్రీ ప్రతిభ కనబర్చారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం రాష్ట్రస్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్‌లోనూ ప్రతిభ కనబరిచి ప్రోత్సాహక బహుమతి అందుకున్నారు. వీరికి ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థులను డీఈవో భోజన్న, ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు, గైడ్ టీచర్ గంగప్రసాద్ అభినందించారు.
హంగిర్గా శివారులో చిరుత సంచారం
తానూరు:మండలంలోని హంగిర్గా శివారు ప్రాంతంలో చిరుత సంచారంతో గ్రామస్తులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా గ్రామ శివారు ప్రాంతంలో కూలీలు, ద్విచక్రవాహన దారులు చిరుత సంచారాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు వ్యవసాయ పనులకు వెళేందుకు జంకుతున్నారు. బుధవారం సాయంత్రం చిరుత సంచారాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రికరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అధికారులకు సమాచారం అందించడంతో బీట్ అధికారి కృష్ణ బుధవారం గ్రామానికి సందర్శించి రైతులతో మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలని, పనులకు వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని సూచించారు. రాత్రివేళ పశువులను ఇంటి సమీపంలో కట్టేసుకోవాలని తెలిపారు.


