
నష్టపోయినా పట్టించుకోరా..?
భైంసా/భైంసారూరల్: భైంసా – బాసర జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా దేగాం వద్ద అసంపూర్తి కల్వర్టు నిర్మాణంతో నష్టపోయిన రైతులు పరిహారం ఇవ్వాలని శనివారం నిరసనకు దిగారు. గ్రామానికి చెందిన మహిళా రైతులు ఉమ, శీల మాట్లాడుతూ ఇటీవల ఇంటి ముందు సోయా పంట ఆరబెట్టగా భారీ వర్షంతో డ్రైనేజీ నుంచి వచ్చిన నీళ్లకు పంట కొట్టుకుపోయింది. కల్వర్టు నీటిని సంబంధిత కాంట్రాక్టరు వాగులోకి మళ్లించకపోవడంతో నష్టపోయామని పేర్కొన్నారు. అదే రోజు అధికారులను కలిసి వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. దీంతో నిరసనకు దిగారు. అయినా నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు. ఓ దశలో ఇద్దరు మహిళా రైతులు ఆత్మహత్య చేసుకుంటామని పురుగుల మందు డబ్బాలను పట్టుకున్నారు. గమనించిన గ్రామస్తులు డబ్బాలను లాక్కున్నారు. నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధులు మేమేం చేస్తాం అంటూ దురుసుగా మాట్లాడారని బాధితులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతోనే పంట కొట్టుకుపోయిందని పరిహారం ఇవ్వాల్సిందే అని బాధిత రైతులు కోరుతున్నారు.