కొత్తవి ఒక్కటీ కేటాయించలే.. | - | Sakshi
Sakshi News home page

కొత్తవి ఒక్కటీ కేటాయించలే..

Oct 20 2025 9:22 AM | Updated on Oct 20 2025 9:22 AM

కొత్తవి ఒక్కటీ కేటాయించలే..

కొత్తవి ఒక్కటీ కేటాయించలే..

● జిల్లాకు వచ్చిన ఇథనాల్‌, ఆయిల్‌పామ్‌ రెండూ దాదాపు పోయినట్లే. ఈ పరిశ్రమలను ఎక్కడ పెట్టాలన్న విషయంపై సరైన స్పష్టత లేకపోవడం, రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్రాంతాలను ఎంపికచేయడంతో రెండూ జిల్లాను వీడనున్నాయి. కనీసం ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లనైనా జిల్లాకు కేటాయించడం లేదు. ● తరాలుగా ఎదురుచూస్తున్న జిల్లా మీదుగా రైల్వేలైన్‌ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ● పర్యాటకపరంగా ఆకట్టుకునే ఎన్నో అందాలున్నా.. జిల్లా వైపు ప్రభుత్వాలు కనీసం కన్నెత్తి చూడటం లేదు. ● పరిశ్రమలు, విద్యాలయాలే కాదు.. రాజకీయంగానూ జిల్లాపై చిన్నచూపే. ● కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలు జిల్లా నుంచి ఒక్క నేతకూ ఓ స్థాయి ఉన్న పదవి ఇవ్వవు. ● గంగదాటితే పక్కనే ఉన్న నిజామాబాద్‌ జిల్లానుంచి ముగ్గురికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులిచ్చారు. జిల్లాకు మాత్రం మొండిచేయి చూపుతున్నారు.

మంజూరు కాని యూనివర్సిటీ కొత్త కళాశాలలకు మోక్షమేది? ఉన్న కాలేజీలో కొత్త కోర్సుల్లేవు ముందుకు కదలని రైల్వేలైన్‌ పరిశ్రమల ఏర్పాటుపై చిన్నచూపు పెదవి విరుస్తున్న జిల్లావాసులు

నిర్మల్‌: ‘అవ్‌ సార్‌.. మన జిల్లా తెలంగాణల లేదా..! లేకపోతే మన ప్రభుత్వాలు నిర్మల్‌ జిల్లాను మర్సిపోయినయా ఏంది..? అరె.. ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని కూడా జిల్లాకు అస్తలేదు. రోజూ పేపర్ల సూస్తున్న.. ఏదో ఒక్క కాలేజో, పరిశ్రమనో, పదవో ఇస్తూనే ఉన్నరు. ఏది జూడు గంగవతల (గోదావరి అవతల)నే అస్తున్నయ్‌. ఒక్కటి కూడ మనదిక్కు ఇస్తలేరు. మరి.. ఏ పనైనా గంగ దాటద్దని గిట్ల సర్కారోళ్లు రూల్‌ పెట్టుకున్నరా.. లేక గీడ అడిగేటోళ్లు లేరని గిట్ల అనుకుంటున్నరా..!?’ అని దిలావర్‌పూర్‌ మండలంలో టీస్టాల్‌ నడుపుకొనే నర్సయ్యలాంటి సామాన్యుడు కూడా జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై అడుగుతున్నాడు. చాలామంది విద్యావంతులు, విద్యార్థులు, తల్లిదండ్రులూ ఇదే తరహాలో ప్రశ్నిస్తున్నారు.

పైచదువు కోసం గంగ దాటుడే..

చదువులతల్లి సరస్వతమ్మ కొలువైన జిల్లాలో ఉన్నతచదువులు ఇప్పటికీ అందని ద్రాక్షే. ఉన్న ఒక్క పీజీ కాలేజీనీ నామ్‌కేవాస్తేగా మార్చేశారు. ఇక ఉన్నతవిద్య కోసం గంగదాటి నిజామాబార్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌ లాంటి పట్టణాలకు వెళ్లాల్సిందే. కనీసం డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లోనూ కొత్త కోర్సులు, ఉపాధినిచ్చే విద్యను ప్రవేశపెట్టడం లేదు. పైచదువులు చదవాలంటే.. ఇంటికి దూరంగా, నెలనెలా అమ్మానాన్నలు పంపే డబ్బులపై ఆధారపడుతూ చదవాల్సిందే. ఈకారణంతోనే డిగ్రీ పూర్తయినా.. ఎంతోమంది పేద, మధ్యతరగతి విద్యార్థులు లోకల్‌గానే ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తూ, ఉపాధి పొందుతూ ఇక్కడే ఆగిపోతున్నారు.

అన్నీ అంతే.. ఏదీ జిల్లాకు రాదు

పైచదువులొక్కటే కాదు.. జిల్లాకు అభివృద్ధిపరంగా ఏ ఫలమూ అందడం లేదు. అభివృద్ధి పనుల కేటా యింపుల్లో కేంద్రం, రాష్ట్రం రెండూ దొందుదొందే అన్నట్లు జిల్లాపై చిన్నచూపు చూస్తూనే ఉన్నాయి.

జిల్లాకు జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నా.. ఈ దిక్కు చూసే ధ్యాసే సర్కారుకు లేదు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు విద్యాలయాలు, అభివృద్ధి పనులను వరుసగా కేటాయిస్తుండగా ఒక్కటీ జిల్లాకు కేటాయించలేదు. రాష్ట్రంలో కొత్తగా హుజూర్‌నగర్‌, కొడంగల్‌, నిజామాబాద్‌లలో వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు మంత్రి మండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొత్త ఇంజినీరింగ్‌ కళాశాల హుస్నాబాద్‌లో, ప్రభుత్వ లా కాలేజీ కరీంనగర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 75 యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తూ జిల్లాకు మాత్రం మొండిచేయి చూపింది. కేంద్రం భద్రాద్రికొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, నిజామాబాద్‌, సంగారెడ్డి, సూర్యాపేటకు జవహర్‌ నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది. కేంద్రం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించింది. కొడంగల్‌, సుల్తాన్‌పూర్‌లో జేఎన్‌టీయూ క్యాంపస్‌లలో సైన్స్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో రామగుండంలో డెంటల్‌ కాలేజీ ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల గంగాధర, ధర్మపురికి డిగ్రీ కాలేజీలు కేటాయించి ఖానాపూర్‌ను మర్చిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement