జీవాలకు టీకా భరోసా
పశువుల్లో గాలికుంటు వ్యాధి ప్రధానంగా వైరస్ వల్ల వస్తుందని వెటర్నరీ నిపుణులు చెప్పారు.
కలుషిత తాగునీరు, పాడైన మేత, వాతావరణ మార్పుల వల్ల వ్యాధి సోకే అవకాశం ఉంది.
ఈ వ్యాధి సోకిన పశువుల నోటి నుంచి రసం రావడం, కాళ్ల గిట్టల వద్ద పుండ్లు ఏర్పడడం, పాల ఉత్పత్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు తెలిపారు.
లక్ష్మణచాంద:పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈనెల 15న జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు.
19 మండలాల్లో టీకా కార్యక్రమం
జిల్లాలోని 19 మండలాల పరిధిలోని సుమారు 400 గ్రామ పంచాయతీల్లో ఈ టీకా కార్యక్రమం జరుగుతోంది. పశుసంవర్ధక శాఖ సమాచారం ప్రకారం జిల్లాలో 48,496 ఆవులు, 55,027 గేదెలు ఉన్నాయి. మూడు నెలల వయసు దాటిన పశువులకు జాతీయ పశు వ్యాధుల నివారణ పథకం కింద టీకాలు వేస్తున్నారు.
39 బృందాలు రంగంలోకి
ఈ కార్యక్రమం సమర్థవంతంగా అమలు అవ్వడానికి జిల్లాలో 39 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈనెల 15న ప్రారంభమైన టీకా పంపిణీ కార్యక్రమం వచ్చే నెల 14 వరకు కొనసాగుతుంది. అధికారులు రెండు లక్షల జీవాలకు టీకాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అవసరమైన టీకాల మొత్తం నిల్వ ఇప్పటికే అందుబాటులో ఉందని తెలిపారు.
రైతులకు ముందస్తు సమాచారం
వ్యాక్సిన్ కార్యక్రమానికి ముందు రోజు ప్రతీ గ్రామంలో టాంటాం ద్వారా సమాచారం అందిస్తున్నారు. రైతులు తమ పశువులకు టీకా చేయించేందుకు సిద్ధంగా ఉండాలని శాఖ సూచిస్తోంది. మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకే బృంద సభ్యులు గ్రామాల్లోకి చేరి పశువులకు టీకాలు వేస్తున్నారు. టీకా వేసిన పశువుల చెవికి క్యూఆర్ కోడ్ ట్యాగ్ చేయడం ద్వారా వివరాలు ‘‘భారత్ పశుధన్’’ యాప్‌లో నమోదు చేస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని పాడి పశువులు ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పశువులు ఉన్న ప్రతీరైతు తన పశువులకు కచ్చితంగా వ్యాక్సిన్ వేయించాలి. గాలికుంటు వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. నవంబర్ 14 వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది.
– ఎండీ.బాలిగ్ అహ్మద్, జిల్లా పశు వైద్యాధికారి
వైరస్ కారణం, లక్షణాలు
జీవాలకు టీకా భరోసా


