మొక్కలను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
నర్సాపూర్ (జి): గ్రామాల్లో మొక్కలు నాటి నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో విజయలక్ష్మి తెలిపారు. మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయ ఆవరణలో 4వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను శనివారం నిర్వహించారు. 13 గ్రామాల్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.5.57 కోట్లతో చేపట్టిన పనులను డీఆర్పీలు, వీఆర్పీలు చదివి వినిపించారు. పనులపై తనిఖీ నిర్వహించగా 13 గ్రామ పంచాయతీల పరిధిలో 74,932 మొక్కలు నాటగా 40,703 మొక్కలు చనిపోయినట్లు రికార్డుల్లో తేలడంతో ఫీల్డ్ అసిస్టెంట్లపై డీఆర్డీవో విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం, మస్టర్లలో కూలీల సంతకాలు, పనుల్లో తేడా, హాజరు లేకుండా వేతనాల చెల్లింపు వంటి తప్పిదాలకు రూ.31,766 రికవరీకి ఆదేశించారు. రైతులకు ఉపయోగపడే ప్రకృతి వ్యవసాయం, నాడెపు కంపోస్టు ఎరువు తయారీ, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, మిద్దె తోటలు, ఆగ్రో ఫారెస్ట్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. నర్సరీలలో ఉపయోగకరమైన మొక్కలు పెంచాలన్నారు. ప్రజా వేదికకు హాజరుకాని వారిపై కమిషనర్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ లక్ష్మయ్య, హెచ్‌ఆర్ మేనేజర్ సుధాకర్, ఎస్‌ఆర్పీ రాజు, ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో తిరుపతిరెడ్డి, పీఆర్ ఏఈ క్రాంతి, ఏపీవో జగన్నాథ్, టీఏలు రవీందర్, సతీశ్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.


