పంటల కొనుగోళ్లకు సిద్ధం కావాలి
భైంసాటౌన్:ఖరీఫ్ పంటల కోతలు మొదలైన నేపథ్యంలో ఉత్పత్తుల కొనుగోళ్లకు అధికారులు సిద్ధంగా ఉండాలని భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్ అన్నారు. పట్టణంలోని ఏఎంసీ కార్యాలయంలో గురువారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోయా, మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రానున్నాయని తెలిపారు. సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లకు కిసాన్ కపాస్ యాప్ అమలు చేస్తోందని, దీనిపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు మహారాష్ట్ర నుంచి ఉత్పత్తులు రాకుండా నిఘా పెట్టాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు, రైతు నాయకుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, వైస్‌చైర్మన్ ఫారూక్ అహ్మద్, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్‌రెడ్డి, డివిజన్ పరిధిలోని రెవెన్యూ, వ్యవసాయ, ఆర్టీఏ, అగ్నిమాపక, పోలీస్, పీఏసీఎస్ అధికారులు పాల్గొన్నారు.


