
రోడ్డెక్కిన సోయా రైతులు
భెంసాటౌన్: భైంసాలో సోయా రైతులు రోడ్డెక్కారు. చేతికొచ్చిన సోయా పంటను రైతులు మార్కెట్‌కు తెస్తున్నారు. సోమవారం రైతులు వివిధ ప్రాంతాల నుంచి 495 లాట్లు వచ్చాయి. అయితే కొనుగోళ్ల ప్రారంభించకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధర కోట్ చేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. గాంధీగంజ్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్పందించిన ఏఎంసీ అధికారులు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయి తే మాటామాటా పెరగడంతో రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడకు చేరుకున్న సీఐ గోపీనాథ్ రైతులతో మాట్లాడారు. మార్కెట్ యార్డుకు ఉదయమే సోయా తెచ్చామని, వ్యాపారులు సాయంత్రం 4:30 వరకు ధర నిర్ణయించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనామ్ సర్వర్ సమస్య ఉందని జాప్యం చేశారని ఆరోపించారు. తీరా వ్యాపారులు ఆలస్యంగా తక్కువ ధర నిర్ణయించారని పేర్కొన్నారు. చాలామంది రైతులకు క్వింటాల్‌కు కేవలం రూ.3,900 ధర మాత్రమే వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండురోజుల క్రితం రూ.4వేలకుపైగా ధర ఉండగా, రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు తగ్గించారని వాపోయారు. ఏఎంసీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పూర్యానాయక్, సీఐ గోపీనాథ్ రైతులను సముదాయించారు. మంగళవారం కొత్త లాట్లు కొనుగోలు చేయకుండా తాత్కాలికంగా బీట్ నిలిపివేస్తామని, ధర తక్కువ కోట్ అయిన రైతులు మంగళవారం మరోమారు బీట్‌లో విక్రయించుకోవాలని సూచించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.

రోడ్డెక్కిన సోయా రైతులు