
వలవేస్తూ.. బలిచేస్తూ..
నిర్మల్‌ఖిల్లా: విదేశాల్లో అధిక వేతనం, సౌకర్యవంతమైన జీవితం అందిస్తామని వాగ్దానం చేస్తూ నకిలీ ఏజెంట్లు గ్రామీణ యువతకు వలవేస్తున్నారు.గల్ఫ్‌లో పెద్ద కంపెనీల్లో ఉద్యోగం, వీసా, ఇంటి వద్ద నుంచే ప్రాసెస్ పూర్తి చేస్తామని ఆశ పెడుతున్నారు. అమాయక యువత రూ.80 వేల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లిస్తున్నారు. తీరా ఫ్లైట్ ఎక్కి అక్కడకు వెళ్లాక ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. తక్కువ జీతం, కఠిన పరిస్థితులు, పాస్‌పోర్టు స్వాధీనం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
జిల్లాలో వరుస ఘటనలు..
తాజాగా జోర్డాన్‌లో ఇబ్బందులు పడుతున్న 12 మంది కార్మికుల వీడియో తాజాగా వైరల్ అయ్యింది. సోన్ మండలం బొప్పారం గ్రామానికి చెందిన యువకుడిని ఇరాక్ పంపిస్తానని డబ్బు తీసుకున్న ఏజెంట్ దుబాయ్‌కి పంపించాడు. అబుదాబిలో క్లీనర్‌గా చేరి సారంగాపూర్ మండలం దేవి తండాకు చెందిన యువకుడు.. అక్కడ చేయని నేరంలో చిక్కుకున్నాడు. 2024లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన ఏజెంట్ మోసంతో నిర్మల్, ఆది లాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన 60 మందికి పైగా బాధితులు ఉన్నారు. ఇలా గల్ఫ్ దేశాలకు అమాయకులను పంపుతున్న ఏజెంట్ల మోసాలు వరుసగా జిల్లాలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ప్రతి నెల ఇలా రెండు మూడు ఉదంతాలు కుటుంబీకుల ఫిర్యాదుల ద్వా రా బహిర్గతమవుతున్నాయి. బాధిత కుటుంబీకులు తమ వారిని ఎలాగైనా స్వగ్రామాలకు రప్పించేందుకు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
బాధితుల వేదన
ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్తున్నవారు.. అక్కడి పరిస్థితులను తట్టుకోలేక తమను స్వగ్రామానికి రప్పించమని గల్ఫ్ సంఘాలు, ఎన్నారై కమిటీలు, రాష్ట్ర కేంద్రాల హెల్ప్‌లైన్‌లకు విజ్ఞప్తి చేస్తున్నారు. కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని అప్పులు తీర్చే మార్గం లేక అవస్థలు పడుతున్నాయి.
నకిలీ ఏజెంట్ల బారిన పడకుండా జాగ్రత్తలు
1. గుర్తింపు ఉన్న, లైసెన్స్ కలిగిన రిక్రూట్‌మెంట్ ఏజెంట్లను మాత్రమే సంప్రదించాలి.
2. ఆన్‌లైన్ ద్వారా ఉద్యోగ సంస్థ వివరాలు, నిజమైనదో కాదో సరిచూసుకోవాలి.
3. వీసా, వేతనం, పని స్వరూపం, వసతి, భోజనం మొదలైనవి రాతపూర్వక ఒప్పందంలో స్పష్టంగా ఉండాలి.
4. ఒప్పందం లేకుండా నగదు చెల్లించకూడదు. అన్ని చెల్లింపులు బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారా చేయాలి.
5. రసీదులు, లావాదేవీల రికార్డులు భద్రంగా ఉంచుకోవాలి.
6. కంపెనీ, వీసా వివరాలు ఆ దేశ ఎంబసీ అధికారిక వెబ్‌సైట్లో నిర్ధారించుకోవాలి.
7. నకిలీ వీసా అని తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
8. విదేశాలకు వెళ్లే ముందు భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్, ఎంప్లాయిస్ సపోర్ట్ సెంటర్ సమాచారం వద్ద ఉంచుకోవాలి.
9. ఫ్రీ డిపార్చర్ ట్రైనింగ్ – టామ్‌కామ్ వంటి సంస్థల శిక్షణలో పాల్గొనాలి.
10. తక్షణ వీసా – అధిక వేతనం వంటి మాయమాటలను నమ్మకూడదు. అవి మోసానికి సంకేతాలు.