
అక్రమ పట్టా రద్దు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: భైంసా మండలం హంపోలి గ్రామంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను అక్రమంగా చేసిన పట్టాను రద్దు చేయాలని, అదే స్థలంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె.రాజు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేసి అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జె.రాజు మాట్లాడుతూ 1983లో వరదల కారణంగా 16/ఆ,16/ఈ సర్వే నంబర్‌లోని ఐదు ఎకరాల పట్టా భూమిని కొని ఎస్సీ ఎస్టీలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆ భూమిలోని ఇళ్లను కూలగొట్టి, ఇతరులకు అక్రమంగా పట్టా చేశారని తెలిపారు. అక్రమ పట్టా రద్దు చేయాలని తహసీల్దార్, ఆర్డీవోతోపాటు పై అధికారులకు నివేదికలు పంపినా రద్దు కాలేదన్నారు. అక్రమంగా పట్టా చేసిన అప్పటి తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ధర్నాలో గ్రామస్తులు విట్టల్, గంగారం, సాయినాథ్, బాబు, ఎల్లన్న, భోజన్న, నరసన్న పాల్గొన్నారు.