
దొంగల బీభత్సం..!
బాసర: బాసరలో దొంగలు బీభత్సం సృష్టించారు. శనివారం అర్ధరాత్రి పట్టణంలోని ఓ బేకరీతో పాటు రెండిళ్లలో దొంగతనం చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బాసర బస్టాండ్ వద్ద ఉన్న శారదా బేకరీలో శనివారం అర్ధరాత్రి దొంగలు పడి షట్టర్ తాళాలు పగులగొట్టారు. లోపలికి చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం యజమాని దశరథ్ దుకాణం తీసేందుకు రాగా తాళం పగలగొట్టినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుకాణంలోని సీసీ కెమెరా, డీవీఆర్‌ను ధ్వంసం చేసినట్లు గుర్తించారు. పట్టణంలోని శారదనగర్, వెంకటేశ్వర కాలనీల్లోని రెండిళ్లలో తాళం వేసిన ఇండ్లలో చొరబడి విలువైన వస్తువులను, నగదు ఎత్తుకెళ్లారు. చోరీకి పాల్పడిన వారిని పట్టుకుంటామని ఎస్సై తెలిపారు.