
అనుమానాస్పదంగా యువకుడి మృతి
ఇచ్చోడ: మండలంలోని ముఖ రా(బి) గ్రామంలో శనివారం సాయంత్రం తోఫిక్ (22) అనే యువకుడు అనుమానాస్పదంగా బావిలో పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. తోఫిక్ అదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులతో కలిసి శనివారం సాయంత్రం కామ్లే రాహుల్ వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లారు. కొంతసేపటి తర్వాత స్నేహితులు బావిలో నుంచి పైకి రాగా తోఫిక్ మాత్రం బయటకు రాలేదు. వెంటనే గ్రామస్తులు బావి వద్దకు వెళ్లే సరికి తోఫిక్ బావిలో మృతి చెంది ఉన్నాడు. ఆదివారం ఉదయం పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి శవపంచానామా నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. మృతుడి తండ్రి రఫీక్‌ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.