
ఆశల ‘ప్రాణహిత’
17 ఏళ్లుగా ఊరిస్తున్న ‘ప్రాణహిత–చేవెళ్ల’ ప్రాజెక్టు రూ.కోట్లతో తవ్విన కాలువలన్నీ ధ్వంసం తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో ఊరట వేగంగా నిర్మిస్తేనే ఈ ప్రాంత రైతులకు మేలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గత పదిహేడేళ్లుగా ఉమ్మడి జిల్లా వాసుల చిరకాల కలగా ఉన్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణంపై మళ్లీ ఆశలు రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణానికి సాగునీటి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించడం ఈ ప్రాంత రైతులకు పెద్ద ఊరటనిస్తోంది. 2008లో ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అటవీ అనుమతులు, కాలువల నిర్మాణం, భూ సేకరణ జరిగాయి. 2016లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రీ డిజైనింగ్‌తో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టింది. బరాజ్‌ను కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా మేడిగడ్డకు మార్చడంతో ఆ ప్రాజెక్టు పూర్తిగా మరుగున పడింది. తర్వాత ఈ ప్రాంత వాసులకు సాగునీటి కోసం డిమాండ్లు రావడంతో ప్రాణహిత, వార్దా, పెన్‌గంగ నదులపై పలు చోట్ల తక్కువ ఎత్తులో సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల కోసం ప్రాజెక్టు కడతామని ప్రణాళికలు వేసినా ముందుకు కదల్లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత కడతామని ఇచ్చిన హామీపై ఆచరణ దిశగా సాగుతోంది.
కాలువలు ధ్వంసం, పైపుల తరలింపు
తుమ్మిడిహెట్టి నుంచి చింతలమానేపల్లి, దహెగాం, వేమనపల్లి, నెన్నెల, మందమర్రి, మంచిర్యాల మండలాల మీదుగా నీళ్లు గోదావరిపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకోవాలి. మరో ప్యాకేజీలో ఎస్సారెస్పీ నుంచి నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌కు నీటిని తరలించాలి. కాళేశ్వరం రాకతో ఈ నీటి తరలింపు నిలిచిపోయింది. దీంతో 40కి.మీపైన తవ్విన కాలువలన్నీ ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల కబ్జాలకు గురయ్యాయి. కొన్ని చోట్ల పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, ఇతర ప్రజాప్రయోజనాలకు వాడుతున్నారు. ఇక కర్జెల్లి, సురగపల్లి, మైలారంలో రిజర్వాయర్ల నిర్మాణం కోసం భూ సేకరణ జరిగింది. వృథాగా ఉన్న పైపులను రెండేళ్ల క్రితమే ఇతర ప్రాంతాలకు తరలించారు. తాజాగా ఆ కాలువలను మళ్లీ వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది.
ప్రత్యేక చొరవ చూపితేనే..
చుట్టూ నీరున్నా ఒక్క భారీ నీటి పారుదల ప్రాజక్టు లేక ఈ ప్రాంత రైతులు అల్లాడుతున్నారు. నీరులేక పత్తి, కంది తదితర ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. చాలాచోట్ల వర్షాధారమే దిక్కు. వానాకాలంలో పంట వేస్తే యాసంగిలో భూములు బీడుగా ఉంటాయి. రెండో పంట వేసుకోలేని దుస్థితి. పల్లెల్లో పనులు లేని సమయాల్లో వలస వెళ్తుంటారు. ఈ క్రమంలో సిర్పూర్ వంటి మారుమూల ప్రాంతంతోపాటు ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల పరిసర రైతులకు సాగునీరందే అవకాశాలు ఉన్నాయి. ఏళ్లుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాక సాగునీటికి దూరంగానే ఉంటున్నారు. మహారాష్ట్రతో గతంలోనే 148మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. తాజాగా 150మీటర్ల ఎత్తు కోసం అనుమతికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో నది అవతల గ్రామాల ముంపు, అటవీ అనుమతులు బరాజ్ నిర్మాణానికి ప్రధాన సవాళ్లుగా మారనున్నాయి. ఏటేటా నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం నిధుల ఖర్చులో ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంది.
చిత్తశుద్ధితో పూర్తి చేయాలి
మారుమూల ప్రాంత రైతులకు సాగునీరందించే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వం చేయడం సంతోషకరమే. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుంది. బరాజ్ నిర్మాణంపై సమగ్ర అధ్యయనం చేయాలి. అలాగే మహారాష్ట్రతో ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వ సహకారంతో మా వంతు కృషి తప్పకుండా చేస్తాం.
– పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్యే, సిర్పూర్
గత ప్రాజెక్టు స్వరూపం
బరాజ్ నిర్మాణం: తుమ్మిడిహెట్టి
నీటి సామర్థ్యం: 160టీఎంసీలు
మొత్తం ఆయకట్టు: 16.40లక్షల ఎకరాలు
లబ్ధిపొందే జిల్లాలు: ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి
ఆదిలాబాద్ ఆయకట్టు: 1.56లక్షల ఎకరాలు
లబ్ధిపొందే గ్రామాలు: 1565
లిఫ్టులు 16
కాలువల పొడవు 512కి.మీ.
కాలపరిమితి: 4ఏళ్లు
అంచనా వ్యయం: రూ.38,500కోట్లు