
ఎస్‌ఐఆర్ పకడ్బందీగా చేపట్టాలి
నిర్మల్‌ఖిల్లా: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఎస్‌ఐఆర్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితాలో డూప్లికేట్, నకిలీ ఓట్ల తొలగింపునకు ఎస్‌ఐఆర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్వహణపై మాస్టర్ ట్రైయినర్ల ద్వారా బూత్ స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రిటర్నింగ్ అధికారి, ఏఈఆర్‌వో, డిప్యూటీ తహసీల్దార్లు, బీఎల్‌వోలతో పర్యవేక్షకులు సమావేశాలు నిర్వహిస్తూ, ఎస్‌ఐఆర్ నిర్వహణపై మాస్టర్ ట్రైయినర్ల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, అధికారులు పాల్గొన్నారు.
ప్రగతి పనులు వేగవంతం చేయాలి
జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంతాల పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన అంశాలపై శుక్రవారం సమీక్షించారు. ఇప్పటికే ప్రారంభించిన పనుల పురోగతిని, అటవీ అనుమతుల మంజూరు వివరాలు తెలుసుకున్నారు. అటవీ ప్రాంతాల్లో ప్రాజెక్టులు అమలు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు సమన్వయం అవసరమని సూచించారు. భూవివాదాలు లేకుండా పనులను పూర్తి చేయాలన్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, సర్వే, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టాలని తెలిపారు. సమావేశంలో డీఎఫ్‌వో నాగినిభాను, ఆర్‌అండ్‌బీ పంచాయతీరాజ్, అటవీ, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.