
‘స్థానిక’ ఎన్నికలపై అనిశ్చితి
నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల 30వ తేదీలోగా నిర్వహించాలని హైకోర్టు గడువు విధించింది. అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో రాజకీయ పార్టీల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నప్పటికీ, ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వడం లేదు.
సన్నాహాల్లో జిల్లా యంత్రాంగం
ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధమైంది. గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయగా, పోలింగ్ స్టేషన్ల తుది జాబితా కూడా ప్రకటించారు. బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బాక్సులు, ఇతర సామగ్రి సిద్ధం చేశారు. జిల్లాలో 400 గ్రామ పంచాయతీలు, 18 జెడ్పీటీసీలు, 157 ఎంపీటీసీలు ఉన్నాయి. మొత్తం 4,49,302 మంది ఓటర్ల కోసం 896 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం కూడా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 10న తుది జాబితాను ఖరారు చేశారు. గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఆధారంగా తీసుకున్నారు. బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ సామగ్రి కూడా సిద్ధంగా ఉంది.
రాజకీయ పార్టీల్లో గందరగోళం
ప్రభుత్వం ఎన్నికలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో రాజకీయ పార్టీల శ్రేణులు గందరగోళం నెలకొంది. గ్రామాల్లో ఆశావహులు ఎన్నికల కోసం ముందస్తు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, షెడ్యూల్ విడుదల కాకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలంటే షెడ్యూల్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందా లేక కోర్టు ద్వారా గడువు కోరుతుందా అనేది కూడా స్పష్టత లేకపోవడంతో అధికార పార్టీ నేతలు సైతం ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని భావిస్తున్నారు.
పంచాయతీ డివిజన్లు 02
జెడ్పీటీసీ స్థానాలు 18
ఎంపీటీసీ స్థానాలు 157
పోలింగ్ కేంద్రాలు 892
గ్రామ పంచాయతీలు 400
వార్డులు 3,368
మొత్తం ఓటర్లు 4,49,302
పురుషులు 2,13,805
మహిళలు 2,35,485
ఇతరులు 12