
పాఠశాలలకు నిర్వహణ నిధులు
లక్ష్మణచాంద: పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు గడిచాక ప్రభుత్వం నిర్వహణ నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, క్రీడా పాఠశాలలకు కంపోజి ట్ స్కూల్ గ్రాంట్ మంజూరు చేసింది. అయితే.. మూడు నెలలుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులే చాక్‌పీస్‌లు, స్టేషనరీ, ప్రయోగ పరికరా లు సొంత ఖర్చులతో కొనుగోలు చేశారు. పాఠశాలల్లో చిన్నచిన్న మరమ్మతులు చేయించారు. విద్యుత్, ఇంటర్‌నెట్ చార్జీలు చెల్లించారు. ఇలా పాఠశాలల నిర్వహణ కోసం అన్ని అవసరాలు తీర్చారు.
నిధుల మంజూరు ఇలా..
ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలకు నిధులు మంజూరు చేసింది. 1–30 మంది విద్యార్థులున్న పాఠశాలకు రూ.10వేలు, 31–100 మంది ఉన్న పాఠశాలకు రూ.25 వేలు, 101–250 మంది ఉన్న పాఠశాలకు రూ.50వేలు, 251–1000 మంది విద్యార్థులున్న పాఠశాలలకు రూ.75వేల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను ప్రభుత్వం ఆయా పాఠశాలల్లోని ఎస్‌ఎంసీ, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఖాతాల్లో జమ చేయనుంది.
ఉమ్మడి జిల్లాకు ఇలా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని నిర్మల్ జిల్లాలో 628 పాఠశాలలుండగా రూ.156.3 లక్షలు, ఆదిలాబాద్ జిల్లాలో 846 పాఠశాలలకు గాను రూ.203.85 లక్షలు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 715 పాఠశాలలుండగా రూ.154.2 లక్షలు, మంచిర్యాల జిల్లాలో 619 పాఠశాలలకు గాను రూ.140.2 లక్షల నిధులు మంజూరయ్యాయి.