
కాంట్రాక్టర్ల ‘మీన’మేషాలు!
చేప పిల్లల టెండర్లకు ముందుకురానివైనం.. ఈనెల 8తో ముగియనున్న గడువు రెండేళ్ల బిల్లులు రూ.4.57 కోట్లు పెండింగే కారణం..
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్రవ్యాప్తంగా చేపల విత్తన(ఫిష్ సీడ్) పంపిణీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సాధారణంగా, వర్షాకాలంలో రిజర్వాయర్లు, చెరువులలో 50 శాతం నీరు నిండిన తర్వాత ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య చేప పిల్లలను వదలడం ఆనవాయితీ. అయితే, ఈ ఏడాది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనడానికి ముందుకు రాకపోవడంతో మత్స్యకారుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. సెప్టెంబర్ 1 నుంచి చేపల విత్తన పంపిణీ టెండర్లు ప్రకటించినప్పటికీ, స్పందన లేకపోవడంతో ప్రభుత్వం గడువును సెప్టెంబర్ 8 వరకు పొడిగించింది.
బకాయిలే కారణం..
గతంలో చేప పిల్లలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ.120 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. అందులో కేవలం రూ.30 కోట్లు మాత్రమే చెల్లించగా, మిగిలిన రూ.90 కోట్లు ఇంకా బకాయిగా ఉన్నాయి. నిర్మల్ జిల్లాకు సంబంధించి రూ.4.57 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. బకాయిలు చెల్లించే వరకు చేప పిల్లల సరఫరాకు ముందుకు రావొద్దని కాంట్రాక్టర్లు నిర్ణయించినట్లు సమాచారం. ఈ పరిస్థితి టెండర్ల ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తోంది.
ఆలస్యమైతే ఎదుగుదలపై ప్రభావం..
చేప పిల్లల పంపిణీ ఆలస్యంపై మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 222 మత్స్యకార సంఘాలు, 13,129 మంది మత్స్యకారులు ఉన్నా రు. వీరు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆగస్టు నెలలో చేపల విత్తనాలను చెరువుల్లో పోస్తే, 8 నుంచి 10 నెలల్లో కిలో లేదా అంతకంటే ఎక్కువ బరువు ఎదుగుతాయి. సమయం దాటితే చేపల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టెండర్ల కోసం బడ్జెట్ కేటాయింపు
2025–26 వార్షిక సంవత్సరానికి నిర్మల్ జిల్లాలో 80 నుంచి 100 మిల్లీ మీటర్లు, 35 నుంచి 40 మిల్లీ మీటర్ల సైజులో 4.28 కోట్ల చేపల విత్తనాల పంపిణీకి టెండర్లను ఆహ్వానించారు. జిల్లాలో 5 జలాశయాలు, 552 చెరువులు/కుంటలు ఉన్నాయి. అయినప్పటికీ, గత బకాయిల సమస్య కారణంగా కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. గడువు ముగిసేలోపు ప్రభుత్వం, కాంట్రాక్టర్ల మధ్య రాజీ కుదిరితేనే ఈ సంవత్సరం చేప పిల్లల పంపిణీ జరుగతుంది.
మత్స్యకారుల జీవనోపాధికి ముప్పు..
చేపల వేటపై గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. చేప పిల్ల ల పంపిణీ ఆలస్యమైతే, ఈ ఏడాది మాత్రమే కాకుండా రాబోయే రెండు మూడు సంవత్సరాలు చేపల ఉత్పత్తి కూడా దెబ్బతింటుంది. ఇది మత్స్యకారుల ఆర్థిక స్థితిని దీర్ఘకాలం దెబ్బతీస్తుంది. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వెంటనే బకాయిలు చెల్లించి చేప పిల్లలు త్వరగా చెరువులు, కుంటలు, జలాశయాల్లో వదిలేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.
వివరాలు:
2023–24 పెండింగ్ బిల్లు
రూ.3,23,60,577
2024–25 పెండింగ్ బిల్లు రూ.1,34,30,497
మత్స్య సంఘాలు 222
సభ్యులు 13,129
35 నుంచి 40 ఎంఎం సీడ్ సరఫరా
టార్గెట్ 2,22,60,000
80 నుంచి 100 ఎంఎం సీడ్ సరఫరా
టార్గెట్ 2,06,08,700