
పఠనాసక్తి పెంచేలా..
పాఠశాలల్లో ప్రారంభమైన ప్రత్యేక పఠన కార్యక్రమం సృజనాత్మకత వెలికితీతకు శ్రీకారం రోజుకో అరగంట కేటాయింపు ఈనెల 15 వరకు కార్యక్రమం
లక్ష్మణచాంద: రాష్ట్ర సమగ్ర శిక్ష, రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్టు సహకారంతో విద్యార్థుల్లో పుస్తక పఠనా ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ, చదవడంపై ఆసక్తిని పెంచాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పాఠశాల స్థాయిలో ఈ చొరవ విద్యార్థుల మేధో సామర్థ్యాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
రోజుకో అరగంట..
సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రతీ పాఠశాలలో రోజుకు అరగంట పఠనానికి సమయం కేటాయించాలి. విద్యార్థులు వార్తాపత్రికలు, సాహిత్య పత్రికలు, కథల పుస్తకాలు వంటివి చదవడం ద్వారా వారి జ్ఞాన పరిధిని విస్తరించుకోవాలి. ఈ లక్ష్యంతో ఇటీవల ప్రతీ పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయగా, అవసరమైన పుస్తకాల సేకరణతోపాటు ఉపాధ్యాయులకు వాటి నిర్వహణపై శిక్షణ కూడా అందించారు.
ఆసక్తి పెంచేలా..
రూమ్ టు రీడ్ ఇండియా సహకారంతో ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో నిర్దిష్ట కార్యకలాపాలు చేపట్టనున్నారు.
1. పాఠశాల ప్రార్థన సమయంలో విద్యార్థులు చిన్న కథలు చెప్పడం ద్వారా వారిలో ఆసక్తిని రేకెత్తించాలి.
2. పాఠశాల, గ్రామ స్థాయిలో కథల రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విద్యార్థులను పఠనంపై ఉత్సాహపరచాలి.
3. ‘ప్రతీ విద్యార్థి ఒక గ్రంథకర్త’ అనే భావనతో సమావేశాలు నిర్వహించాలి.
4. విద్యార్థుల పఠన కార్యకలాపాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలి.
5. ‘నా పుస్తకం–నా కథ’ ఇతివృత్తంతో విద్యార్థులతో పోస్టర్లు రూపొందించాలి.
6. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి చదివే కార్యక్రమాలు నిర్వహించాలి.
జిల్లా సమాచారం...
జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 577
విద్యార్థుల సంఖ్య 23,398
ప్రాథమికోన్నత పాఠశాలలు 89
విద్యార్థులు 6,373
ఉన్నత పాఠశాలలు 164
విద్యార్థులు 37,019
మొత్తం విద్యార్థుల సంఖ్య 67,790
మంచి కార్యక్రమం
విద్యార్థుల్లో పఠానాసక్తిని పెంపొందించడం కోసం సమగ్ర శిక్ష ప్రాజెక్టు ద్వారా ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం మంచి నిర్ణయం. దీంతో విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. – శ్వేత, ఉపాధ్యాయురాలు,
పీచర పాఠశాల
ఆసక్తి పెరుగుతుంది
పాఠశాల్లో సోమవారం నుంచి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పుస్తక పఠనం, పఠనాసక్తి, సృజనాత్మకత పెరుగుతాయి. – వాణి, ఉపాధ్యాయురాలు,
కనకాపూర్ పాఠశాల

పఠనాసక్తి పెంచేలా..

పఠనాసక్తి పెంచేలా..