
ఆదుకున్న ఆగస్టు..!
భైంసాటౌన్: ఈసారి వర్షాలు ఆలస్యమైనా అన్నదాతను ఆదుకున్నాయి. భారీ వర్షాలతో కొంతమేర పంటలకు నష్టం వాటిల్లినా.. యాసంగి పంటలకు భరోసా ఏర్పడింది. ఆగస్టులో వారం రోజులు కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు, వాగులు పొంగి ప్రవహించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా బాసరలో గోదావరి ఉగ్రరూపం చూపింది. ప్రాజెక్టులు నిండుకుండలా మారి జలకళ సంతరించుకున్నాయి. తద్వారా ఆయా చెరువులు, ప్రాజెక్టుల కింద సాగయ్యే యాసంగి పంటలకు భరోసా ఇచ్చినట్లయింది.
లోటు నుంచి సాధారణానికి..
జిల్లాలో ఏటా జూలైలోనే భారీ వర్షాలు కురిసేవి. రైతులు సైతం ఈనెలలోనే పంటలు సాగు చేసేవారు. కానీ ఈసారి ఆగస్టు వరకు వర్షాభావ పరిస్థితి నెలకొంది. జూన్‌లో వర్షాకాలం మొదలు ఆగస్టు రెండోవారం వరకు లోటు వర్షపాతం నెలకొంది. అడపాదడపా కురిసిన వర్షాలతో ఖరీఫ్ పంటలకు ప్రయోజనం చేకూరినా.. భారీ వర్షాలు లేకపోవడంతో యాసంగి పంటలపై రైతుల్లో ఆందోళన కనిపించింది. జూన్ మొదటివారంలో 99 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, రెండోవారంలో 102 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. మళ్లీ ఆపై రెండువారాలూ లోటు వర్షపాతం నమోదైంది. జూలై నెలంతా సాధారణ, లోటు వర్షపాతం నమోదు కాగా, ఆగస్టు మొదటివారంలో వానలే పడలేదు. రెండోవారంలో 43 శాతం సాధారణ వర్షం కురవగా, మూడోవారంలో 145 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఎట్టకేలకు భారీ వర్షాలు కురవడంతో జిల్లాలో లోటు నుంచి సాధారణ వర్షపాతం నమోదైంది.
ప్రాజెక్టులు నిండుగా..
జూన్, జూలైలో సరైన వర్షాలు లేక జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నీరు చేరలేదు. భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు, సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు, కడెంలోని కడెం ప్రాజెక్టు కింద వేలాది ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తుంటారు. యాసంగి పంటలకు ఈ ప్రాజెక్టులపైనే రైతులు ఎక్కువగా ఆధారపడతారు. అలాగే చెరువుల కింద సైతం అధికసంఖ్యలో రైతులు పంటలు సాగు చేస్తుంటారు. ఆగస్టులో భారీ వర్షాలతో జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. చెరువులు, కుంటలు సైతం జలకళ సంతరించుకున్నాయి. ఫలితంగా యాసంగిలో పంటల సాగుకు భరోసా దక్కింది.