
ఆస్తి, ప్రాణ నష్టంపై నివేదికలు పంపండి
నిర్మల్‌చైన్‌గేట్: ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలపై క్షేత్రస్థాయిలో సర్వే చేసి సమగ్ర అంచనాలతో నివేదికలు పంపాలని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. హైదరా బాద్ సచివాలయం నుంచి సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద నష్టంపై సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ సహాయ చర్యలు చేపట్టా లని సూచించారు. పంట నష్టం, ఇళ్లు దెబ్బతినడం, రహదారులు, చెరువులు, వంతెనలకు జరిగిన నష్టాలను విభాగాలవారీగా కచ్చితంగా లెక్కించి సమర్పించాలన్నారు. ఇందులో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు.
నివేదికలు సిద్ధం చేయండి..
అనంతరం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలతో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలను నివేదికలను సిద్ధం చేయాల ని ఆదేశించారు. రెవెన్యూ, విద్య, వైద్య, వ్యవసా య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, మత్స్య, విద్యుత్ తదితర శాఖల అధికారులందరూ నిబంధన మేరకు నివేదికలు మంగళవారం సమర్పించాలని సూచించారు. ఇందులో ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, భైంసా సబ్‌కలెక్టర్ సంకేత్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.