
సద్గురు బోధనలు అనుసరణీయం
జైనూర్: తన హితబోధతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు సద్గురు పూలాజీ బాబా. మహారాష్ట్రలోని పర్‌భని జిల్లా, నాగ్‌నాథ్ ఔండా తాలుకాలోని బయాన్‌రావు గ్రామంలో 30 ఆగస్టు 1925లో ఆంద్ తెగలోని నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన ధోండిజి ఇంగ్లే–పుంజాబాయి పుణ్య దంపతులకు బాబా జన్మించారు. తల్లి పుంజాబాయి గొప్ప శివభక్తురాలు, భజన, సత్సంగ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. చిన్న వయస్సులోనే పూలాజీబాబా తండ్రి కరువు కాటకాల నుంచి తప్పించుకుని బతుకుదెరువు కోసం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పట్నాపూర్ ఆంద్‌గూడ గ్రామానికి 1947లో శాశ్వతంగా వలస వచ్చారు. వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించారు. తల్లి పుంజాబాయి, గురువు గణపతి వాడ్గురే బోధనలతో ప్రభావితమైన పంచాగ్ని యోగా సాధనతో పాటు వేదాలు, ఉపనిషత్తులు ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి పూలాజీ బాబా పరమయోగిగా మారారు.
బాబా తత్వమిదే..
‘అనంత విశ్వంలో మనమున్నాం. మనలో విశ్వం దాగి ఉంది. పంచభూతాల నిలయం మానవ దేహం. ఈ దేహమే దేవాలయం. శరీరంలోని కుండలి, శక్తిని ఉత్తేజితం చేయడంతో భక్త సాక్షాత్కారం లభించి ప్రశాంత జీవితం పొందగలరు’ అని ఆయన బోధించారు. జీవుడే దేవుడు అంటూ భక్తుల మానసిక వికాసానికి జీవితాంతం కృషి చేసి గురుపీఠం గౌరవాన్ని పెంచిన పరమ యోగి శ్రీసిద్ది యోగా పీఠం, సిద్దేశ్వర సంస్థాన్‌ను నెలకొల్పారు.
ఆత్మ విశ్వాసాన్ని నింపిన బోధనలు
బాబా బోధనలు ఎందరిలోనో ఆత్మ విశ్వాసాన్ని నింపాయి. అనేక మంది జీవితాలు ఇతరులకు ఆదర్శమయ్యాయి. బాబాను విమర్శించే వారు అతడి పాదక్రాంతులయ్యారు. బాబా భక్తులు నేటికీ అతడు చూపిన మార్గంలో జీవిస్తూ ఆయా గ్రామాల్లో ధ్యాన కేంద్రాలు నెలకొల్పారు. మూఢ నమ్మకాలకు స్వస్తి పలికి సత్ప్రవర్తనను అలవర్చుకున్నారు. పూలాజీ బాబా హితబోధతో ఎంతోమంది జీవితాలు మారాయి. నేటికీ బాబా చూపిన మార్గంలో భక్తులు మాంసాహారం, మద్యానికి దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు.
వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి..
జైనూర్ మండలంలోని పట్నాపూర్ శనివా రం నిర్వహించనున్న పూలాజీ బాబా జ యంతి వేడుకలకు తెలంగాణతోపాటు మ హారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు సిద్దేశ్వర సంస్థాన్ కు తరలిరానున్నారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, కిన్వట్ ఎమ్మెల్యే భీంరావు కేరామ్ తదితరులు హాజరుకానున్నారు.
12 ఏళ్లు తపస్సు చేసి..
మల్లంగి తపోభూమిలో 12 ఏళ్లు బాబా తప స్సు చేశారు. మల్లంగి అరణ్య ప్రదేశం దట్ట మైన వృక్షాల నడుమ ఓ నది తీర ప్రాంతంలో అల్లనేరేడు వృక్షం కింద తపస్సు చేసేవా రు. ఈ క్షేత్రం నేడు సిద్దేశ్వర సంస్థాన్ మల్లంగిగా పిలువబడుతోంది. బాబా ఇక్కడే ధ్యానధారణ చేసేవారు. పూలాజీ బాబాకు 1965–66లో ఆత్మసాక్షాత్కారం అయింది.