
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
రామకృష్ణాపూర్: పట్టణంలోని ‘ఏ’ జోన్ రాంనగర్ ప్రాంతానికి చెందిన చీపురుశెట్టి సతీశ్ (40) శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పట్టణ ఏఎస్సై వెంకన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాల కారణంగా సతీశ్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
పెంబిలో మరొకరు..
పెంబి: మానసిక స్థితి బాగా లేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై హన్మాండ్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన అందె రమేశ్ (40)కు కొంతకాలంగా మానసిక స్థితి బాగా లేదు. కుటుంబ సభ్యులు కొద్దిరోజుల క్రితం బెల్లంపల్లిలో చర్చికి తీసుకెళ్లి ప్రార్థన చేయించారు. అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా ఎవరికీ చెప్పకుండా ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులోని అటవీప్రాంతలో తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య భాగ్య, ఇద్దరు కొడుకులున్నారు. పెద్ద కొడుకు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.