
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఖానాపూర్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్, కడెం, పెంబి, దస్తూరాబాద్ మండలాల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్, ఇరిగేషన్, రెవెన్యూ, మండల పరిషత్, ఇతర శాఖల అధికారులు వర్షాల సమయంలో స్థానికంగా ఉండి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. రోడ్లు దెబ్బతిన్న చోట తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంతోపాటు శాశ్వత మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఎస్సారెస్పీతోపాటు సదర్మాట్, గోదావరి, చెరువులు, కుంటలు, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. అంతకుముందు పట్టణంలోని మైనార్టీ స్కూల్‌కు వెళ్లే మార్గంలో కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డును పరిశీలించారు.