
నష్టమే మిగిలింది
పంటలపై ఇసుక మేటలు.. రైతుల కంట కన్నీళ్లు.. 10 వేల ఎకరాలకుపైగా నష్టం పదులసంఖ్యలో దెబ్బతిన్న రోడ్లు ప్రమాదకరంగా 23 చెరువులు
నిర్మల్: ‘అవసరమున్నప్పుడు రాని వాన.. వద్దంటే పగబట్టినట్టే కురిసింది. చేతికి వస్తుందనుకున్న పొలం ఇసుకపాలాయే. తెల్లబంగారమనుకున్న పత్తిపంట నేలవాలిపాయే. సాయమవుతదనుకున్న సోయా మునిగిపాయే.. మాకష్టం ఎవరికి చెప్పుకోవాలె..’ అంటూ భారీవర్షానికి పంటలు నష్టపోయిన రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. జిల్లాలో బుధవారం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు దంచికొట్టిన వాన ఎన్నో అనర్థాలను మిగిల్చింది. దాదాపు 16 మండలాల్లో శుక్రవారం మధ్యాహ్నం వరకు వేసిన అంచనాల ప్రకారం 9,200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 600 ఎకరాల్లో పంటలపై ఇసుక మేటలు వేసి, ఎందుకూ పనిరాకుండా చేసింది. ఆయా మండలాల్లో వరి, పత్తి, సోయాబీన్ పంటలకు కోలుకోలేని నష్టం వాటిల్లింది. వాగులు, కాలువలు ఉప్పొంగడంతో జిల్లాలోని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. భారీవాన జిల్లావ్యాప్తంగా ఐదు ఇళ్లను దెబ్బతీసింది. తానూరు మండలం మొగ్లి, ఝరి(బి), దౌలతాబాద్, ఎల్వత్, కోలూరు తదితర గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా 23 చెరువులు పూర్తిగా నిండి ప్రమాదకరంగా ఉండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో శుక్రవారం భైంసా డివిజన్ ను వర్షం ఇబ్బందిపెట్టింది. పట్టణంతోపాటు పలు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మరోవైపు జిల్లా సరిహద్దుగా సాగుతున్న గోదావరి ఉగ్రరూపంలోనే ఉరకలెత్తుతోంది. పరివాహకంలోని పంటలను ముంచెత్తుతోంది.
పంటలపైనే ప్రతాపం..
ఈసారి వానప్రతాపం పంటలపైనే కొనసాగింది. సీజన్ ప్రారంభం నుంచి ప్రశాంతంగా వర్షాలు కురి సాయని రైతులు సంతోషంగా సాగు చేసుకుంటున్న సమయంలో వరుణుడు విరుచుకుపడ్డాడు. గోదావరితోపాటు, వాగులు, వంకలు, అలుగుల కింద దా దాపు 9,200 ఎకరాల పంట నష్టపోయినట్లు శుక్రవారం మధ్యాహ్నం వరకు అధికారులు అంచనా వే శారు. ఇందులో ప్రధానంగా పత్తి 2,823 ఎకరాల్లో, వరి 2,491ఎకరాల్లో, సోయాబీన్ 2,152 ఎకరాల్లో, మొక్కజొన్న 1,100 ఎకరాల్లో దెబ్బతింది.మొత్తం 4,762మంది రైతులు నష్టపోయినట్లు ఇప్పటి వరకు వ్యవసాయాధికారులు లెక్కతేల్చారు.
కొట్టుకుపోయిన పల్లె రోడ్లు..
జిల్లాలో 2021 నుంచి ఏటా వర్షబీభత్సం కొనసాగుతోంది. ప్రతిసారీ రోడ్లు దెబ్బతింటూనే ఉన్నాయి. ప్రధానంగా పల్లెరోడ్లు కాస్త గట్టివానకే కొట్టుకుపోతున్నాయి. ఈసారీ పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 50కిపైగా రోడ్లు 122కి.మీ. మేర దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. వీటిలో తాత్కాలిక మరమ్మతులకు రూ.1.07 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.6.80 కోట్లు అవసరమున్నట్లుగా అంచనా వేశారు. ఇక ఆర్‌అండ్‌బీ పరిధిలో 35–40 రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి నష్టం అధికారులు అంచనావేస్తున్నారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ట్రాన్స్‌ఫార్మలు దెబ్బతిన్నాయి. నష్టం అంచనా వేసేపనిలో సిబ్బంది ఉన్నారు.
ఈ చిత్రంలో నేలవాలిన పత్తి చేనును దీనంగా చూస్తున్న రైతుపేరు గంగారావు. కుంటాల మండలం అంబకంటి గ్రామం. ఆరెకరాల్లో పత్తిపంట సాగుచేశాడు. ఈసారి కాలం కలిసి వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. ఇంతలో భారీవర్షం ముంచేసింది. వరద ఉధృతికి పత్తిపంట నేలవాలింది. దీంతో రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.