
‘స్థానిక’ కసరత్తు ముమ్మరం
ముసాయిదా ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల ఎంపీడీవో, పంచాయతీ కార్యాలయాల్లో ఓటరు ప్రదర్శన నేటితో ముగియనున్న అభ్యంతరాల స్వీకరణ గడువు వచ్చేనెల 2న తుది జాబితా
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మకరందు మంద
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు శరవేగంగా ఏర్పా ట్లు చేస్తోంది. తాజాగా, ఓటర్ల తుది జాబితా ప్రకటన షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో త్వరలో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, జిల్లాలోని 400 గ్రామపంచాయతీలకు సంబంధించిన ఓటరు జాబితాలను వార్డుల వారీగా మండల పరిషత్, గ్రామపంచాయతీ కార్యాలయాల నోటీస్ బోర్డులపై గురువారం ప్రదర్శించారు. ఈ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 30 వరకు స్వీకరిస్తారు. శుక్రవారం జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 30 వరకు అభ్యంతరాలు స్వీకరించి 31న పరిష్కరిస్తారు. సెప్టెంబరు 2న జాబితా ప్రకటిస్తారు.
అధికార యంత్రాంగం సిద్ధం..
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉంది. బ్యాలెట్ బాక్స్‌లతోపాటు, ఇతర రాష్ట్రాల నుంచి 1,730 బాక్స్‌లు సమకూర్చారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఉద్యోగుల నివేదికలు సిద్ధం చేశారు. 3,368 వార్డులకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు.
పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు..
గ్రామపంచాయతీ ఎన్నికల ఆలస్యంతో ఆశావహులు నిరీక్షిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై స్పష్టత లేకపోవడం ఆలస్యానికి కారణమని భావించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల అ మలుపై ప్రకటన చేయడం, ఓటరు జాబితా షె డ్యూల్ విడుదలతో ఆశావహుల్లో ఉత్సాహం చిగురించింది. సెప్టెంబరు 30లోగా ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
తుది ఓటరు జాబితాకు సహకరించాలి
గ్రామ పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ఇప్పటికే ప్రదర్శించామన్నారు. ఈ జాబితాలపై అభ్యంతరాలను ఈనెల 30వ తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 2న తుది జాబితాను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా రాజకీయ పక్షాలు సహకరించాలని తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకుడు కోరిపెల్లి శ్రవణ్‌రెడ్డి, ఎంఐఎం నాయకుడు మజార్, బీఆర్‌ఎస్ నేత కోరిపెల్లి రాంకిషన్‌రెడ్డి, టీడీపీ నేత రమేశ్, వైఎస్సార్‌సీపీ నేత నరేశ్, ఆప్ నేత హైదర్ పాల్గొన్నారు.
జిల్లాలో ఓటర్ల వివరాలు..
మొత్తం 4,49,302
పురుషులు 2,13,805
సీ్త్రలు 2,35,485
ట్రాన్స్‌జెండర్లు 12
పంచాయతీ డివిజన్లు 02
మొత్తం మండలాలు 18
గ్రామపంచాయతీలు 400
వార్డులు 3,368
ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మకరందు మంద ఆదేశించారు. అదనపు కలెక్టర్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రణాళికపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన సదుపాయాలు సమకూర్చుకోవాలన్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్‌అహ్మద్ మాట్లాడుతూ అధికారులంతా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని సూచించారు. వీడి యో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.