
గోదావరి ముంచింది
లక్ష్మణచాంద: మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతోపాటు, ఎగువ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురవడంతో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు 39 గేట్లను ఎత్తి, గోదావరి నదిలోకి 5.75 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ వరద లక్ష్మణచాంద మండలంలోని పీచర, ధర్మారం, పార్‌పెల్లి, మునిపల్లి, మాచాపూర్, చింతల్‌చాంద, చామన్‌పెల్లి గ్రామాల్లో వందల ఎకరాల్లో పంటలను ముంచింది. గోదావరి పరీవాహక గ్రామాల్లో రైతులు సాగు చేసిన పత్తి, మొక్కజొన్న, సోయా, వరి, పసుపు పంటలు పూర్తిగా నీటమునిగాయి. 285 రైతులకు చెందిన 315 ఎకరాల సోయా, 110 మంది రైతులకు చెందిన 125 ఎకరాల వరి, 55 మంది రైతుల 48 ఎకరాల పత్తి, 45 మంది రైతుల 85 ఎకరాల మొక్కజొన్న, మొత్తం 573 ఎకరాల్లో పంటలు నీటమునిగాయని మండల వ్యవసాయ అధికారి వసంత్‌రావు తెలిపారు. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయని, నీటి కింద ఏ పంట ఉందో గుర్తించ డం కష్టంగా ఉందని పేర్కొన్నారు. వరద తగ్గాక నష్టం మరింత పెరుగుతుందని వెల్లడించారు.
ఏటా ఇదే పరిస్థితి..
గత రెండేళ్లుగా భారీ వర్షాల కారణంగా పీచర, ధర్మారం, మునిపల్లి, మాచాపూర్, పార్‌పెల్లి, చింతల్‌చాంద గ్రామాల్లో వివిధ పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది కూడా వర్షాలు మళ్లీ ఉధృతంగా కురవడంతో నష్టం మరింత తీవ్రమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2003లో భారీ వర్షాల కారణంగా పంటలకు ఇంత తీవ్రమైన నష్టం జరిగిందని, 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఇటువంటి విపత్తు తలెత్తిందని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
పరిహారంపై ఆశలు..
సోయాబీన్, మొక్కజొన్న పంటలు ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉన్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో వరదలు ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన తమను ఆదుకోవాలని, పరిహారం చెల్లించాలని వేడుకుంటున్నారు.