
భైంసా డివిజన్‌లో దంచికొట్టిన వాన
భైంసా/భైంసారూరల్/తానూరు: భైంసా డివిజన్‌లో గురువారం రాత్రి వర్షం దంచికొట్టింది. దీనికితోడు ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో గోదావరి ఉప్పొంగింది. మరోవైపు మంజీరా వరద పోటెత్తింది. దీంతో బాసరలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంత పంటలను ముంచింది. మహారాష్ట్ర నుంచి వచ్చే వరదతో సిరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అలుగు నుంచి వచ్చే నీటి ఉధృతికి గుట్ట సమీపంలోని దోని వద్ద కాలువ మరోసారి తెగింది. గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఇలేగాం, సిరాల, దేగాం, వాలేగాం గ్రామాల్లోని పంటలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నిలిచిన రాకపోకలు..
దేగాం–ఇలేగాం గ్రామాల మధ్య లోలెవల్ వంతెన నీటమునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముధోల్ మండలం ముద్గల్, తానూరు మండలంబోల్సా, ఝరి గ్రామాల్లో వాగులు పొంగి రవాణా స్తంభించింది. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మళ్లీ మునిగిన వంతెన..
పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో గుండేగాం వంతెన మరోసారి నీటమునిగింది. శ్మశానవాటిక పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ప్రాజెక్టు నీరు గ్రామంలోకి చేరుతోంది. పోలీసు అధికారులు రాకపోకలను నిలిపివేసి, అప్రమత్తమయ్యారు.
నీటమునిగిన పంటలు..
తానూరు మండలంలో కురిసిన వర్షంతో వాగు పరీ వాహక ప్రాంతాల్లోని సోయా, పత్తి పంటలు నీట మునిగాయి. ఝరి(బి) లోలెవల్ వంతెన, మసల్గాతండా–మొగ్లి, దౌలతాబాద్, కోలూరు, వాడవన బోల్సా డబుల్ రహదారిపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు గంట ల తరబడి నిరీక్షించి గ్రామాలకు చేరుకున్నారు. బోల్సా గ్రామ సమీపంలో వరదకు రోడ్డు కొట్టుకుపోగా, ఎమ్మెల్యే రామారావు పటేల్ పరిశీలించారు. బోల్సా, తొండల, మొగ్లి, మసల్గా, జౌలా(బి), మహాలింగి, బామ్ని గ్రామాల్లో పంటలు దెబ్బతి న్నాయి. ఎంపీడీవో నసీరొద్దీన్, ఎస్సై షేక్‌జుబేర్ గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.

భైంసా డివిజన్‌లో దంచికొట్టిన వాన