
వస్తారు.. చూస్తారు.. వెళ్తారు..!
భైంసాటౌన్: ‘భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుతో ఏటా తమ కాలనీలు ముంపునకు గురవుతున్నాయి.. మునిగినప్పుడే అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తున్నారు.. చూసి వెళ్లిపోతున్నారని సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం లేదు’ అని ముంపు బాధితులు కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టర్ అభిలాష అభినవ్, ప్రత్యేకాధికారి హరికిరణ్ పట్టణంలోని రాహుల్‌నగర్, ఆటోనగర్ ప్రాంతాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రాహుల్‌నగర్‌లోని డబ్బాకాలనీవాసులు పలువురు కలెక్టర్‌కు తమ సమస్యలు చెప్పుకున్నారు. కాలనీని ఆనుకుని ఉన్న డ్రెయినేజీ కుచించుకుపోయి, వర్షపు నీరు, మురుగునీరు వెళ్లేదారి లేక ఇళ్లలోకి వస్తోందని తెలిపారు. ఎగువన సాత్‌పూల్ వంతెన వద్ద ఒకరు తన భూమికి ఆనుకుని బండరాళ్లు వేశారని, దీంతో సుద్దవాగులోని వరదనీరు కాలనీని ముంచుతోందని పేర్కొన్నారు. ఆటోనగర్‌లోనూ ఎంఐఎం నాయకులు పలువురు కలెక్టర్‌కు సమస్యలు విన్నవించారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు నీటితో ఏటా ఆటోనగర్‌లోని చాలావరకు ముంపునకు గురవుతోందన్నారు. ప్రాజెక్టు దిగువన సుద్దవాగు వెంబడి నీరు పారేందుకు సరైన మార్గం లేక కాలనీలోకి నీరు చొచ్చుకొస్తోందని తెలిపారు. వాగు వెంట ఇష్టారీతిన ఆక్రమణలతో ఈ పరిస్థితి ఎదురవుతోందన్నారు. స్పందించిన కలెక్టర్ ప్రస్తుతం.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారుల వెంట అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ బి.రాజేశ్‌కుమార్ ఉన్నారు.
త్వరలో మరమ్మతులు చేపడతాం
కుంటాల: భారీ వర్షాలకు దెబ్బతిన్న వంతెనలు, రోడ్లకు త్వరలో శాశ్వత మరమ్మతులు చేపడతామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మండలంలోని అందకూర్ అలుగు వద్ద బుంగను ప్రత్యేక అధికారి హరికిరణ్, అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. వరదల కారణంగా నీటి ప్రవాహంలోకి వెళ్లొద్దని సూచించారు. వారివెంట తహసీల్దార్ కమల్‌సింగ్, ఎంపీడీవో అల్లాడి వనజ, ఎంపీవో రహీంఖాన్ ఉన్నారు.