
రికార్డుస్థాయిలో వర్షం..
నిర్మల్: ‘గణపతి బప్పా మోరియా.. మంగళమూర్తి మోరియా.. గణేశాయా.. పానీలాయా..’ అంటూ జిల్లా బుధవారం ఉదయం ఘనంగా వినాయకచవితి ఉత్సవంలో మునిగి ఉండగా.. ఒక్కసారిగా నల్లమబ్బులు కమ్ముకున్నాయి. భయంకరమైన ఉరుములు, మెరుపులతో జడివాన ముంచెత్తింది. ఇలా వచ్చి అలా వెళ్లిపోతుందేమో.. అని ఎంతసేపు చూసినా.. తగ్గలేదు సరికదా.. గంటగంటకూ పెరుగుతూ చివరకు లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. నిర్మల్‌అర్బన్, నిర్మల్‌రూరల్ మండలాల్లో కనుచూపు మేరలో ఏముందోకూడా కనిపించనంత దట్టంగా కురిసింది. మళ్లీ మూడేళ్లక్రితం సీన్‌ను రిపీట్ చేసింది. ఈ రెండు మండలాల్లో గతంలో ఎన్నడూ కురవని రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాకేంద్రంతోపాటు పలుమండలాల్లో భారీ వర్షం కురిసింది. వరదకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. పిల్లాజెల్లాతో ఎన్నో కుటుంబాలు పండుగపూట బిక్కుబిక్కుమంటూ మోకాలులోతు బురదనీళ్లల్లో నిద్రలేకుండా గడపాల్సి వచ్చింది. వరద ముంచెత్తడంతో పంటలు దెబ్బతిన్నాయి.
జిల్లా కేంద్రం.. జలసంద్రం..
పేరుకు జిల్లాకేంద్రం కానీ.. అడుగడుగునా కబ్జాలతో ఎక్కడా నాళాలు, కందకాలు సరిగా లేని దుస్థితి. ఇప్పటికీ కనీసం డ్రైనేజీ వ్యవస్థంటూ లేదు. అధికారులు, పాలకుల ఈ నిర్లక్ష్యమే మరోసారి నిర్మల్‌ను మళ్లీ నీటముంచింది. తాజాగా కురిసిన అతిభారీ వర్షం జిల్లాకేంద్రాన్ని జలసంద్రంలా మార్చేసింది. మూడేళ్లక్రితం జడివాన ఘటనను గుర్తుచేసింది.
భయపెట్టిన ‘బంగల్‌చెరువు’..
భారీవర్షాలకు కట్ట కోసుకుపోతుండటంతో జిల్లాకేంద్రంలోని బంగల్‌చెరువు స్థానికులను భయపెట్టింది. జిల్లాకేంద్రంలోని వినాయకులను నిమజ్జనం చేసేది ఈ వినాయక్‌సాగర్‌లోనే. ఇటీవలే ఈ చెరువు తూమును కొత్తగా నిర్మించారు. తూముకు ఇరువైపులా కేవలం మొరం వేసి వదిలేయడంతో భారీ వర్షానికి కోతకు గురైంది. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో కలెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ జానకీషర్మిల, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. హుటాహుటిన ఇసుక బస్తాలతో తాత్కాలిక చర్యలు చేపట్టారు.
సేవలందించిన చేతులు..
ఓవైపు భారీవర్షం, మరోవైపు సగం మునిగేలా వరదనీరు.. అందులోనూ తమవంతుగా సేవలందించారు పలువురు యువకులు. జిల్లాకేంద్రంలోని నటరాజ్‌నగర్‌లో బుధవారం రాత్రి భారీవర్షం, వరదలో చిక్కుకుపోయిన వృద్ధురాలు, ఓ క్షతగాత్రుడిని స్థానిక యువకులు క్షేమంగా బయటకు తీసుకువచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయ్యప్ప సేవాసమితి, కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఆహార పదార్థాలు అందించారు.
క్షేత్రస్థాయిలో ఉంటూ..
భారీ నుంచి అతిభారీ వర్షం ఉన్నట్లు అందిన సమాచారంతో కలెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ జానకీషర్మిల, అడిషనల్ కలెక్టర్లు, అడిషనల్ ఎస్పీలు, జిల్లా ఉన్నతాధికారులు, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. దాదాపు రోజంతా క్షేత్రస్థాయిలో ఉంటూ స్వయంగా చర్యల్లో పాలుపంచుకున్నారు. బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్, మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు.
జిల్లాలో బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం వరకు రికార్డుస్థాయిలో వర్షం కురిసింది. మూడేళ్లక్రితం 2021, జూలై 22న జిల్లామొత్తం కలిపి దాదాపు 150 మి.మీ కాగా, నర్సాపూర్(జి)245మి.మీ వర్షపాతం నమోదైంది. ఇదే చాలా ఎక్కువగా భావిస్తున్న క్రమంలో తాజాగా మరింత రికార్డుస్థాయిలో అత్యధికంగా నిర్మల్(332.8మి.మీ.), నిర్మల్‌రూరల్(332.4మి.మీ.), లక్ష్మణచాంద(218.6మి.మీ), సోన్(208.4మి.మీ.), నర్సాపూర్(జి)(202.6మి.మీ.) మండలాల్లో వర్షపాతం నమోదైంది. దాదాపు 20గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది.