
ప్రాజెక్టులకు పోటెత్తిన వరద
భైంసాటౌన్: జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు భారీగా చేరడంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుతోపాటు కడెం ప్రాజెక్టు, సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టుల్లోకి వస్తున్న వరదను గమనిస్తూ.. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
కడెంకు లక్ష క్యూసెక్కులు..
కడెం ప్రాజెక్టుకు భారీ ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. ఉదయం 20 వేలకుపైగా క్యూసెక్కుల వరదనీరు చేరగా, ప్రాజెక్టు అధికారులు ఆరు గేట్లు ఎత్తి 41 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎడతెరిపి లేని వానతో ప్రాజెక్టుకు అంతకంతకు ఇన్‌ఫ్లో పెరుగుతూ వచ్చింది. సాయంత్రం 99 వేల క్యూసెక్కుల వరద చేరడంతో మరో నాలుగు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, 696.200 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ నీటిని విడుదల చేస్తున్నారు.
గడ్డెన్నవాగు మూడు గేట్లు ఎత్తివేత..
భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు గురువారం భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఉదయం 4 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే ఉండడంతో ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. కాగా, గంటగంటకు ఇన్‌ఫ్లో పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, 358.40 మీటర్ల నీటిమట్టం కొనసాగిస్తూ నీటి విడుదల చేశారు. మధ్యాహ్నం 6,800 క్యూసుక్కులు రాగా రెండు గేట్లు ఎత్తారు. సాయంత్రం సమయానికి 17,500 క్యూసెక్కులకు పెరగడంతో మరోగేటు ఎత్తి 18,500 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
స్వర్ణ రెండు గేట్లు ఎత్తివేత..
సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు కాగా, ప్రస్తుతం 1,181.7 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు ప్రాజెక్టుకు 1,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, రెండు గేట్ల ద్వారా 1,900 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాయంత్రానికి ఇన్‌ఫ్లో 5,700లకు పెరిగింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు.