
అండగా ఉంటాం
● జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని, అండగా ఉంటామని జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ తెలిపా రు. కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను గురువారం పరిశీలించారు. పట్టణంలోని బోయవాడలో పర్యటించి, వర్షపు నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటు న్న ప్రజలతో మాట్లాడారు. ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు తక్షణ సహాయం అందజేస్తామన్నారు. కాలనీలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మంచిర్యాల చౌరస్తా, విశ్వనాథ్‌పేట్, శాంతినగర్ సమీపంలో దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. భవిష్యత్తులో వరద సమస్యలు రాకుండా శాశ్వత చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లాలో వర్షపాతం వివరాలు, వరద పరిస్థితులు, నష్ట నివారణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ ప్రత్యేక అధికారికి వివరించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నిర్మల్‌చైన్‌గేట్: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం మాట్లాడారు. అత్యవసరమైతే ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలోనివారిని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబరు 91005 77132 ను సంప్రదించాలని సూచించారు. మత్స్యకారులు, పశు కాపరులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్న ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లక్ష్మణచాంద మండలం మునిపల్లి గ్రామంలో వాగు అవతలి వైపు చిక్కుకున్న శంకర్ అనే పశువుల కాపరిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల సహకారంతో రక్షించగలిగామన్నారు. సమావేశంలో డీపీఆర్వో విష్ణువర్ధన్ పాల్గొన్నారు.