
శంకర్ సేఫ్
36 గంటలు జలదిగ్బంధంలో పశువుల కాపరి
కదిలొచ్చిన జిల్లా యంత్రాంగం
సాహసోపేతంగా రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది
లక్ష్మణచాంద: మండలంలోని పార్‌పెల్లి తండా కు చెందిన గుగ్లావత్ శంకర్ గోదావరి నది వరదలో చిక్కుకున్నాడు. 36 గంటల తర్వాత ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సాహసోపేతంగా అతడిని కాపాడాయి. బుధవారం ఉదయం శంకర్, మునిపల్లికి చెందిన శ్రీనివాస్, లింగన్నలు గోదావరి వద్ద పశువులను మేపడానికి వెళ్లారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేతతో నీటి ప్రవాహం పెరగడంతో శ్రీనివాస్, లింగన్నలు తెప్పలతో ఒడ్డుకు చేరగా శంకర్ మాత్రం కుర్రులో చిక్కుకున్నాడు.
ఎన్‌డీఆర్‌ఎఫ్ సాహసం..
ఎస్పీ జానకీషర్మిలగజ ఈతగాళ్లు, జాలర్లతో బుధవారం సాయంత్రమే రక్షణ చర్యలు ప్రారంభించారు. పొద్దుపోవడం, వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రయత్నాలు విఫలమయ్యాయి. గురువారం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు రెండు బోట్లతో శంకర్‌ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. అంతకు ముందు అధికారులో డ్రోన్ ద్వారా శంకర్‌కు ఫోన్, ఆహారం, నీరు పంపించారు. దీంతో రక్షణకు మార్గం సుగమం చేసింది. ఎస్పీ జానకీషర్మిల ట్రాక్టర్‌పై ఒడ్డుకు చేరి, శంకర్‌కు వేడి టీ అందించి ధైర్యం చెప్పారు. కలెక్టర్ అభిలాష అభినవ్ నీటి విడుదల తగ్గించేలా సమన్వయం చేశారు. బయటకు వచ్చిన శంకర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రాత్రంతా భయం భయంగా గడిపినట్లు పేర్కొన్నారు. జీవితంపై ఆశలు వదులుకున్నట్లు చెప్పాడు. ఎన్‌డీఆర్‌ఎఫ్, అధికారుల కృషికి కృతజ్ఞతలు తెలిపాడు.