
పిల్లలపై ఓ కన్నేయండి!
బడిఈడులోనే తప్పటడుగులు లేత వయసులో నేరాలు పసిమనసులపై సెల్‌ఫోన్ తీవ్రప్రభావం ఏంచూస్తున్నారో.. పరిశీలించాలంటున్న సైకియాట్రిస్టులు ‘టెన్త్‌క్లాస్ కిల్లర్’పై జిల్లాలోనూ చర్చ
నిర్మల్: ఈ రోజుల్లో చిన్న వయసులోనే పిల్లల తప్పుడు ఆలోచనలు, నేరపూరిత ప్రవర్తన తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో పదో తరగతి విద్యార్థి ఒక చిన్నారిని హత్య చేసిన ఘటన, జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత బానిసలవుతున్న తీరు చర్చనీయాంశంగా మారాయి. ఈ సమస్యల వెనుక తల్లిదండ్రుల నిర్లక్ష్యం, సెల్‌ఫోన్ వినియోగం, మీడియా ప్రభావం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
ప్రేమ పేరుతో తప్పిదాలు..
15 ఏళ్లు నిండని పిల్లలు ప్రేమ, గర్ల్‌ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్ వంటి విషయాల గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతేడాది జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఇలాంటి ఘటన జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యానికి తెలియజేయడంతో, ఇద్దరు విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపించారు. ఇక సినిమాలు, సోషల్ మీడియా రీల్స్, వెబ్ సిరీస్‌లు, ఓటీటీ వేదికల్లోని క్రైం కథనాలు విద్యార్థులు, యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి. హింసాత్మక ఆన్‌లైన్ గేమ్‌లు, యూట్యూబ్‌లోని విపరీత ధోరణి వీడియోలు పిల్లల మనసుల్లో నేరపూరిత ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి.
తల్లిదండ్రుల నిర్లక్ష్యం..
ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ బిజీ జీవనశైలిలో మునిగిపోయి, పిల్లల విషయంలో శ్రద్ధ చూపడం మరచిపోతున్నారు. పిల్లల కోర్కెలు తీర్చడానికి సెల్‌ఫోన్‌లు, బైక్‌లు కొనిచ్చేస్తున్నారు కానీ, వాటిని ఎలా ఉపయోగిస్తున్నారో పట్టించుకోవడం లేదు. గతంలో తాతమ్మలు, నానమ్మలు పిల్లల ప్రవర్తనను గమనించేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉపాధ్యాయులు కూడా ఈ విషయంలో బాధ్యత వహించకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. పిల్లల సెల్‌ఫోన్ వినియోగిస్తున్న తీరు చూసి గర్వపడుతున్న తల్లిదండ్రులు, వారు ఏ కంటెంట్ చూస్తున్నారో గమనించడం లేదు. చదువుకునే వయసులో సెల్‌ఫోన్ అవసరమా అనే ప్రశ్నను కూడా వారు వేయడం లేదు. ఓటీటీలు, యూట్యూబ్, రీల్స్‌లోని కంటెంట్ పిల్లల మనసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.