
సర్కారు బడుల్లో అఆ.. ఇఈ.. ‘ఏఐ’..
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవం అన్నిబడుల్లో కృత్రిమమేధ తరగతులు గణిత కరిక్యులంలో ఈ ఏడాది నుంచే.. ఈ విద్యాసంవత్సరం ప్రాథమిక స్థాయిలో అమలు
నిర్మల్‌ఖిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లిటరసీ, కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ద్వా రా విద్యాబోధనను అమలు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో గణిత బోధనలో సాంకేతికతను వినియోగించడం లక్ష్యంగా, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గతేడాది పైలట్ ప్రాజెక్ట్‌గా 19 పాఠశాలల్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం, ఈ సంవత్సరం జిల్లాలోని అన్ని పాఠశాలలకు విస్తరించనుంది. జిల్లాస్థాయిలో 48 కాంప్లెక్స్ ల నుంచి 96 మంది ఉపాధ్యాయులు ఒకరోజు శిక్షణ పొందారు. ఏప్రిల్ 3, జూలై 31 తేదీల్లో రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన ఐదుగురు డీఆర్పీలు ఈనెల 13న ఈ శిక్షణను అందించారు. ఈ ఉపాధ్యాయులు ఈ నెల చివరి వారంలో కాంప్లెక్స్ సమావేశాల్లో తమ సహోద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నారు.
డిజిటల్ లిటరసీ సిలబస్
1 నుంచి 5వ తరగతి విద్యార్థుల కరిక్యులంలో డిజిటల్ లిటరసీని జోడించారు. 1, 2 తరగతుల పుస్తకాల్లో ప్రథమ భాగంలో, 3 నుంచి 5వ తరగతుల పుస్తకాల్లో ద్వితీయ భాగంలో కృత్రిమ మేధ ద్వారా పాఠాలు బోధించనున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలతో సమానంగా నిలిపేందుకు దోహదపడుతుందని విద్యాశాఖ భావిస్తోంది.
సాంకేతిక సాధనాలు
ఈ విద్యా సంవత్సరంలో గణిత బోధన కోసం జీ–కంప్రైజ్, ఎడ్యుఆక్టివ్ 8, కోడ్‌మిత్ర, చాట్‌బాట్, ఏఎక్సెల్ వంటి ఎస్సీఈఆర్టీ రూపొందించిన సాంకేతిక సాధనాలను ఉపయోగిస్తారు. ఇవి విద్యార్థులకు ఆకర్షణీయంగా, సులభంగా అర్థమయ్యేలా ఉంటాయి. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్‌ఎస్) వంటి సాంకేతికతలు విద్యార్థుల ఉత్సాహాన్ని పెంచి, డ్రాపవుట్ రేటును తగ్గిస్తాయని అధికారులు విశ్వసిస్తున్నారు.
సౌకర్యాల విస్తరణ
జిల్లాలో 700కు పైగా పాఠశాలల్లో డిజిటల్ లిటరసీ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత ్వం ఇప్పటికే ట్యాబ్‌లను పంపిణీ చేసింది. త్వరలో డెస్క్‌టాప్ కంప్యూటర్లను కూడా అందించనున్నా రు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు.
పేద విద్యార్థులకు ప్రయోజనం..
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు డిజిటల్ ఇంటెలిజెన్స్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులు ఉత్సాహపరితంగా నేర్చుకునేందుకు వీలుపడుతుంది. రానున్న రోజుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని జిల్లా ఇన్‌చార్జి డీఈవో పరమేశ్వర్, అకడమిక్ మానిటరింగ్ అధికారి నర్సయ్య అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన డీఆర్పీలు 5
జిల్లాస్థాయిలో శిక్షణపొందిన ఎమ్మార్పీలు 96
మండలాలవారీగా శిక్షణపొందనున్న
ఉపాధ్యాయులు 1,200
మొత్తం కాంప్లెక్స్‌లు 48
మొత్తం పాఠశాలలు 735